14-04-2025 09:03:45 PM
పిట్లం (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిట్లం మండ్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బాబా సాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గం ఎప్పటికీ ప్రజాస్వామ్యానికి ఆదర్శమూర్తి. ఆయన కృషి కారణంగానే భారతదేశం ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించగలిగింది" అని అన్నారు. దేశ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంబేద్కర్ గారు అందించిన సేవలు అపూర్వమైనవి అని కొనియాడారు. అసమానతలేని సమాజం నిర్మాణమే ఆయన జీవిత ఉద్దేశం. ప్రజా సంక్షేమాన్ని ఆధారంగా చేసుకుని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది అని ఎమ్మెల్యే తెలిపారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, ఆయన ఆశయాలను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారి సేవలను స్మరించుకున్నారు.