ప్రస్తుతం పురాణాల ఆధారంగా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. రామాయణ, మహాభారతాల నుంచి పాత్రలను తీసుకుని సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్ (బార్బరికుడు) మీద చిత్రం రాబోతోంది. ‘త్రిబాణధారి బార్బరిక్’ అంటూ క్యాచీ టైటిల్‌తో చిత్రం రాబోతోంది.
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మించిన ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ‘ఎవరు తాతా ఇతను?.. ప్రపంచం గుర్తించని ఒక గొప్ప యోధుడమ్మా..’ అంటూ సాగిన డైలాగ్స్.. ఇచ్చిన ఎలివేషన్స్.. ఆర్‌ఆర్, విజువల్స్ ఇలా అన్నీ కలిపి మోషన్ పోస్టర్ అంచనాలు పెంచేసింది.
ఏకకాలంలో మూడు బాణాలు వేయడంలో బార్బరికుడు నేర్పరి. అందుకే త్రిబాణధారి అని టైటిల్‌లోనే పెట్టేశారు. ఇక మోడ్రన్ కాలం నాటి తుపాకులు, బుల్లెట్లు కూడా ఈ మోషన్ పోస్టర్‌లో చూపించారు. గాండివదారి అర్జున, పాశుపశాస్త్రం, బ్రహ్మాస్త్రం, గరుడ పురాణం వంటి పుస్తకాలను కూడా ఈ వీడియోలో చూపించారు. మరి ఆ కాలానికి, ఈ కాలానికి కథను ఎలా లింక్ చేశారో చూడాలి. ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ఉధయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.