28-08-2024 03:25:38 AM
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హనుమకొండ, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఆదివాసీలు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వచ్చిన ఆయనకు మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్ ఘనస్వాగతం పలికారు.
అనంతరం కలెక్టరేట్‌లో రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. విద్యా, ఆరోగ్య రంగాకి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటుపై ఆయన మంత్రి సీతక్కను అభినందించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు శ్రీజ, మహేందర్‌జీ పాల్గొన్నారు.
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు కట్టుదిట్టం..
జనగామ, ఆగస్టు 27 (విజయక్రాంతి): గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఓబుల్ కేశ్వాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయ పరిధిలోని మినీ స్టేడియానికి విచ్చేయనున్నారు. మంగళవారం ఈ ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. రూట్ మ్యాప్ ప్రకారం భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, జెడ్పీ సీఈవో సరిత, డీపీవో స్వరూప, డీఆర్డీఏ వసంత తదితరులు పాల్గొన్నారు.