24 కిలో మీటర్ల పాదయాత్ర...
వనపర్తి (విజయక్రాంతి): గిరిజనులు సాగు చేసుకుంటున్న 426 ఎకరాల భూమిని సీలింగ్ చట్టాల ప్రకారంగా గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలని మాజీ ఎంపిపి కృష్ణ నాయక్ అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం మామిడి మాడ తండా నుండి వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వరకు మాజీ ఎం.పీపీ కృష్ణా నాయక్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్య నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ఆంజనేయులు ఆధ్వర్యములో 24 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ఆర్.డి.ఓ కి వినతిపత్రంను అందచేశారు.
ఈ సందర్బంగా మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్ మాట్లాడుతూ.. 150 సంవత్సరాలుగా మేము భూమి సాగు చేసుకుంటున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందజేసి సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కృషి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీలింగ్ చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరాములు, పుట్టఆంజనేయులు, నందిమల్ల అశోక్, జాత్రు నాయక్, పద్మ, నిక్సన్, పరమేశ్వర చారి పాల్గొన్నారు.