27-03-2025 12:00:00 AM
ఆదివాసీలకు స్వయం పాలన కావాలని, ఏజెన్సీలో ఆదివాసీ హక్కులు అమలు చేయా లని, ఏజెన్సీలో గిరిజనేతర సామ్రాజ్యవాదాన్ని సమా ధి చేయాలంటే సాయుధ పోరాటమే మార్గమని, ఆ మార్గంలో ప్రయాణించి అమరత్వం చెందిన ఆదివాసీ సాయుధ పోరాట యోధుడు కుంజ రాము.
ఆదివాసీలు ఇతర ప్రాంతాల వారితో సమానంగా వృద్ధి చెందాలంటే స్వయం పాలనా ఉద్యమాలు తప్పనిసరని త్రికరణ శుద్ధిగా నమ్మిన విప్లవ యోధుడు కుంజ రాము. అవిభక్త వరంగల్ జిల్లా పాకల కొత్తగూ డెం మండలంలోని మోకాళ్ళపల్లి నిరుపేద కోయతెగ కుటుంబంలో పుట్టిన కుంజ రాము పదిహేనేళ్ళ వయసులోనే విప్లవోద్యమబాటలో నడిచారు. అడవితల్లి ఒడిలో అక్షరాభ్యాసం నేర్చిన ఏకైక ఆదివాసీ విప్లవ విద్యార్థ్ధి.
35 ఏళ్ళ పాటు సాగిన అజ్ఞాత ఉద్యమ జీవితంలో ప్రజాస్వామ్య, సామాజిక మార్పు కోసం ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఉద్యమాల రూపకల్పనలో క్రియాశీల పాత్రను వహించారు. మూడు తరా లుగా సాగుతున్న విప్లవోద్యమంలో నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ.
సీపీఎం (ఎంఎల్)తో తెగదెంపులు
భారత సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ (దళిత బహుజన శ్రామిక విముక్తి) కార్యదర్శిగా ఉన్న రాము ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని ట్రైబల్ లిబరేషన్ ఫ్రంట్ (టీఎల్‌ఎఫ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు దశాబ్దా లుగా తాను నమ్మిన సీపీఎం (ఎంఎల్) అనేక గ్రూపులుగా చీలిపోయిందని, చిత్తశుద్ధి గల విప్లవ నాయకులు పార్టీని వదలడమో, అమరులు కావడమో జరిగిందని, ప్రస్తుతం పార్టీ శ్రేణులలో అవకాశవాద నాయకులదే పై చేయిగా మారిందని రాము పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలలో విప్లవ పార్టీలు పనిచేస్తున్నప్పటికీ గిరిజనుల మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదని విప్లవపార్టీలకు గిరిజన సమస్యలు ప్రాధాన్యం కలిగినవి కాకపోవడం వల్ల నిరంతరం వారిని అంటిపెట్టుకుని వారి అభివృద్ధి కోసం కృషి చేయడం లేదని, అందువల్ల గిరిజనులకు ఒక ప్రత్యేకమైన వేదిక ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ వేదిక ఏర్పాటు చేశారు.
గిరిజనుల రక్షణకు ఎన్ని చట్టాలున్నా, ఏజెన్సీలో గిరిజనుల దోపిడీ నేటికి కొనసాగుతునే ఉందని, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వైద్యానికి, విద్యకు మెజార్టీ గిరిజనులు దూరంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇంకొకవైపు బహుళజాతి సంస్థల ప్రయోజ నాల కోసం రాజ్యంగం లోని 5,6 షెడ్యూల్స్, 1/70 వంటి చట్టాలనుసవరించాలని ప్రయత్నిస్తున్నారని ఈ ప్రయత్నాలకు అడ్డుకట్టవేయకపోతే అభివృద్ధి ముసుగులో ఆదివాసీలను అంతం చేస్తారని భవిష్యత్ నూ అంచనా వేశారు.
రాబోయే 5 సంవత్సరాల్లో ఈ వేదికను రాష్ట్రంలో పటిష్టం చేసి దక్షిణ మధ్య భారతదేశం లోని ఇతర ఆదివాసీ గిరిజన ప్రాం తాలకు విస్తరింపచేసే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను రూపొంది స్తున్నట్లు సుదీర్ఘమైన డ్యాకుమెంట్‌లో కుంజ రాము తెలిపారు.
అమరులే మార్గదర్శకం
కాకతీయుల నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడి అమరులైన మేడారం సమ్మక్క, సారక్క, జంపన్నలు, నిజాం నిరంకుశ పాలనతో పోరాడి 1858లో ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్‌లో ఉరితీయబడ్డ రాంజీగోండు, 1940లో బూటకపు ఎన్‌కౌంటర్‌కు బలైన కొమురంభీంలు మార్గదర్శులని, ఆదివాసీ సమస్యలు సంఘ సంస్కర్తలకే పట్టని రోజుల్లో అంటరాని తనం సమస్యతో బాటు ఆదివాసీ గిరిజనుల సమస్యలను తొలి సారిగా జాతీయ ప్రజల దృష్టికి తెచ్చి గాంధీ, అంబేద్కర్‌లను టీఎల్‌ఎఫ్ గౌరవిస్తుందని, గిరిజనుల కోసం అమరులైన అల్లూరి సీతారామరాజు నుంచి వీరన్న వరకుఅందర్నీ ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పారు.
1980లో 15 సంవత్సరాల వయసు కలిగిన కుంజ రాము చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలోని సీపీఐ (ఎంఎల్) పార్టీ అంతిరెడ్డి దళంలో సభ్యుడిగా చేరాడు. రెం డు దశాబ్దాలుగా దళ సభ్యుడిగా, దళ నాయకుడిగా, ఏరియా కమిటీ కార్యదర్శి, రీజినల్ కమిటీ కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వ హించిన కుంజ రాము గిరిజనులు కోసం ఈ వేదిక ఏర్పాటు చేశారు. 20 ఏళ్ళుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న కుంజ రాము తాను పుట్టిన గిరిజన తెగల కోసం అంకితం కావటానికి నిర్ణయించుకోవడం ఆ రోజుల్లోనే విప్లవ పార్టీలలో భారీ ఎత్తున చర్చ జరిగింది.
ఉమ్మడి విప్లవ పార్టీలో మావో ఆలోచనలను ఆకళింపు చేసుకుని జనశక్తి పార్టీలో తిరుగులేని విప్లవ నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో విప్లవోద్యమంలో చీలికల్లో భాగంగా సిపిఎస్ యుఐ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతుండగా అరెస్టు అయి, జైలు జీవితం గడిపిన సమరశీలి. శ్రామికుల, రైతు కూలీల న్యాయపోరాటాన్ని నడిపించి నవ సమాజ స్థాపన కోసం భావసారూప్యత గల ఉద్యమ శక్తులను సమీకరించి రాజ్యాధికారాన్ని సాధించాలంటే అణగారిన వర్గాల పోరాటాలు.
ప్రధాన భూమిక పోషించాలని భావించి వివిధ కుల సంఘాలైన తుడుందెబ్బ, మాదిగ దండోరా, డోలి దెబ్బ, మోకు దెబ్బ, పూసల కక వంటి అనేక కుల సంఘాలను సంఘటితపర్చిన ఆదివాసీ యోధుడు. జల్, జంగిల్, జమీన్ కోసం,మా ఊళ్ళో మా రాజ్యం అనే స్వయంపాలన కాంక్షతో పోరాడారు.
ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ ఏర్పాటు
స్వయం పాలన కోసం, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం గెరిల్లా తరహా పోరాటమే శరణ్యమని భావించిన రాము 2004 సెప్టెంబర్ 30న ఆదివాసీ లిబరేషన్ టైగర్స్‌ను స్థాపించారు. ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ బలపడితే షెడ్యూల్ ప్రాంతాలపై తమ ఆధిపత్యం చెల్లదని గ్రహించిన ప్రభుత్వం రాముపై నిఘా పెంచింది. ఆదివాసీ లిబరేషన్ టైగర్ దళాన్ని మట్టు బెట్టేందుకు 2005 మార్చి 27న వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ఎర్రమ్మ గుట్టలపై సమావేశంలో ఉన్న రాముపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరపగా, అమరత్వం పొందారు.
సూర్యోదయం కుట్ర కాదు. కానీ కుంజ రాము మరణం మాత్రం కచ్చితంగా కుట్రే. ఎందుకంటే మిత్రద్రోహంతో శత్రువుల చేజిక్కారు. ప్రాణస్నేహితులే పంచమాంగ దళం అని, సహచరులూ స్వార్థపరులేనని గ్రహించలేక పోయారు.
కుంజ రాము మార్క్సిజం, ఫూలే ,అంబేద్కరిజంతో అస్తిత్వ పోరాటాలకు శ్రీకారం చుట్టారు. కులచైతన్యంతో హక్కుల పోరాటాలు మొదలు పెట్టారు. అంతిమంగా బహుజన రాజ్యాధికారం వైపు పోరాటాలు ఎక్కుపెట్టారు. అస్తిత్వ పోరాటాలతోనే ఆగిపోలేదు. తను నమ్మిన కులవర్గ సిద్ధాంతం మీద రాముకు దృఢ విశ్వాసం. సడలని పట్టు. మొక్కవోని ధైర్యం. మొహమా టం అసలే లేదు.
స్పష్టమైన వైఖరి. కటువైన, బలమైనవ్యక్తీకరణ ఆయన సొంతం. స్వేచ్ఛా ప్రియుడు. విప్లవ కారుడు నిర్బంధాన్ని సహించడు. త్యాగాలు చేయలేక కాదు. శత్రువుకు భయపడీ కాదు. ప్రజల మధ్య ఉండి, ప్రజా ఉద్యమాలకు చేరువగా ఉండాలనుకున్నారు. బ హుజన శ్రామిక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయలేకే బహిరంగ జీవితాన్ని కోరుకున్నారు. సామాన్య ప్రజలంటే అమితమైన ప్రేమ.
ఆ ప్రజలకోసం రేయింబవళ్ళు పోరు బాటలో పయనించారు. తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. చివరి శ్వాస వరకు చిరునవ్వే చిరునామాగా జీవించారు. ధైర్యాన్ని దరహాసంగా ప్రదర్శించిన మహా యోధుడు కుంజ రాము ఈ రోజుకీ వీరుడే. ఏజెన్సీలో ఆదివాసీలకు స్వయంపాలన రావాలంటే కుంజ రాము స్ఫూర్తి ని కొనసాగించవసిన అవసరం ఎంతైనా ఉంది.
వూకె రామకృష్ణ దొర