28-02-2025 01:33:17 AM
అధికారులను ఆదేశించిన పీవో రాహుల్
భద్రాచలం, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : పర్యాటకులు సందర్శించడానికి ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను సర్వ సుందరంగా వీక్షకులకు తన్మత్వయము చెందేలా ముస్తాబు చేస్తున్నందున దానికి సంబంధించిన పనులు మార్చి 10వ తేదీ నాటికి పూర్తి కావాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
గురువారం నాడు సాయంత్రం మ్యూజియం కమిటీ సభ్యులతో కలిసి మ్యూజియం పరిసరాలలో ఏర్పాటు చేస్తున్న బాక్స్ క్రికెట్ గ్రౌండ్ మరియు సందర్శకులకు వివిధ రకాల తినుబండారాల కొరకు సిద్ధం చేసిన పరిసరాలను బోటింగ్ సౌకర్యం కొరకు తయారుచేసిన చెరువును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా మార్చి 10వ తేదీ వరకు పూర్తి కావాలని, పాతకాలపు ఇండ్లలో కావలసిన వస్తువులు సమకూర్చాలని, అన్ని తెగలకు సంబంధించిన ఆచారా వ్యవహారాలు, కట్టుబాట్లు, సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి బుక్లెట్ తయారు చేయించాలని, పాతకాలపు ఇంటి లోపల బయట కోయ భాషలో స్వాగతం పలికే పెయింటింగ్ వేయిం చాలని, మ్యూజియం ప్రాంగణం పరిధి మొత్తం విద్యుత్ కాంతులతో ప్రతిబింబించే విధంగా విద్యుత్ లైట్లు అమర్చాలని అన్నారు.
ఖాళీగా ఉన్న గోడల పైన గిరిజనులకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలు చిత్రీకరించాలని, ఇంకా ఏమైనా పాతకాలపు గిరిజనుల వస్తువులు ఉంటే త్వరితగతిన సేకరించాలని కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ ఓ ఉదయభాస్కర్, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, డి ఈ హరీష్, జేడీఎం హరికృష్ణ, స్పోర్ట్స్ అధికారి గోపాల్‌రావు, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి పాల్గొన్నారు.