అధికారుల ఆదేశించిన ఐటీడీఏ పిఓ రాహుల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పర్యాటకులు సందర్శించడానికి ముస్తాబు చేస్తున్న గిరిజన మ్యూజియం పనులు సాధ్యమైనంత తొందరగా మిగిలిన పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించే విధంగా కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. శుక్రవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియంను ఆయన సందర్శించి జరుగుతున్న పనులను ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. పిల్లలు ఆడుకునే విధంగా క్రీడా పరికరాలు, మ్యూజియంలో అమర్చిన సోలార్ విద్యుత్ లైట్ల ఏర్పాట్లు చాలా వరకు పూర్తి చేయడం జరిగిందని, అలాగే పర్యాటకులు బోటింగ్ చేయడం కోసం ఏర్పాటుచేసిన కుంటను పూర్తిగా శుభ్రం చేయించాలని, స్టాల్స్ ఏర్పాట్లు, గిరిజన వంటకాలు తయారు చేసే ప్రదేశాలు, చుట్టుపక్కల ఉన్న చెత్తను తొలగించాలని గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్ కు ఆదేశించారు.
మ్యూజియం చూడడానికి వచ్చే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉన్నందున అందరూ ప్రత్యేక దృష్టి సారించి అన్ని సౌకర్యాలు సమకూరే విధంగా చూడాలని అన్నారు. ప్రస్తుతం మ్యూజియంనకు సుందరీకరణ పనులు జరుగుతున్నందున మ్యూజియం సిబ్బంది క్రీడాస్థలంలోని పరికరాలు, సోలార్ విద్యుత్ లైట్లు, లాంతర్లు ఇతర వస్తువులపై ప్రత్యేకంగా నిఘ పెట్టి ఉంచాలని, ఏ వస్తువు దొంగిలించబడ్డ సంబంధిత కాపలాకాసే మ్యూజియం సిబ్బంది బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఎఫ్ డి ఓ ఉదయ్ కుమార్, ఏసిఎంవో రమణయ్య, డి ఈ హరీష్, ఏపీవో పవర్ ఏఈ మునీర్ పాషా, ఏడిఎంహెచ్ఓ చైతన్య, జేడీఎం హరికృష్ణ, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.