03-04-2025 07:50:38 PM
ఏప్రిల్ 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచే ప్రారంభానికి అంతా సిద్ధం..
భద్రాచలం (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనుల ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు తినే ఆహార పదార్థాలు బాహ్య ప్రపంచానికి తెలియజేయటానికి ఏర్పాటుచేసిన గిరిజన మ్యూజియం అన్ని హంగులు సమకూర్చుకొని ఏప్రిల్ 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచే ప్రారంభోత్సవం చేసుకోవటానికి సిద్ధమయింది. ఐటీడీఏ పీవో గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ వచ్చిన వెంటనే నూతన సంప్రదాయాలకు, నూతన వరవడికి శ్రీకారం చుడుతూ ఐటీడీఏలో అనేక విప్లమాత్మక మార్పులు తీసుకుని వస్తున్నారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణశాతం పెట్టడానికి గిరిజన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పలుసార్లు సమావేశమై అనేక సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకువెళ్లారు.
అంతేకాకుండా గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యపై పట్టు సాధించడానికి ఉద్దీపం కార్యక్రమాన్ని చేపట్టి విద్యాపరంగా ఇబ్బంది పడకుండా బలమైన స్టాండర్డ్ ఇవ్వాలని ఉద్దేశంతో అనేక మార్పులు చేసి ముందుకు వెళ్తు రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శి శరత్ ప్రశంసలు సైతం పొంది రాహుల్ అనుచరించిన విధానాన్ని అన్ని ఐటిడీలు అనుసరించేలా చేశారు. అంతేకాకుండా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచ నలుమూలల తెలియజేయటానికి భద్రాచలంలో గిరిజన మ్యూజియంను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకొని అనతి కాలంలోనే దాన్ని ప్రారంభించే స్థాయికి తీసుకుని వచ్చారు. మారుమూల ప్రాంతాలలో గిరిజనులు వాడుకునే వస్తువులతో పాటు వారి ఆచార్య వ్యవహారాలు సంప్రదాయం తినే వస్తువులు వారు వేటకు వెళ్ళినప్పుడు వాడే పరికరాలతో పాటు గిరిజనులకు సంబంధించిన అన్ని వస్తువులు గిరిజన మ్యూజియంలో ఉండేలా ఏర్పాటు చేశారు.
భద్రాద్రి రామున్ని దర్శనం చేసుకునే ప్రతి భక్తులు గిరిజన మ్యూజియం కూడా సందర్శించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్నారు. గిరిజన మ్యూజియం ఏర్పాటు తుది దశకు చేరుకోవడంతో ఏప్రిల్ ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. తక్కువ కాలంలో ఐటీడీఏ పీవో గా వచ్చి అందరితో మంచిగా ఉంటూ గిరిజన అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న రాహుల్ ని పలు గిరిజన సంఘాల నాయకులు, భద్రాద్రి వాసులు అభినందనలు తెలియజేస్తున్నారు.