calender_icon.png 5 February, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన చట్టాలు అమలు చేయాలి

19-01-2025 12:00:00 AM

డ్బ్బుయేడేళ్ళ స్వతంత్ర భారతంలో గిరిజనుల అభివృద్ధి మా త్రం ఇంకా వెనుబడే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల చట్టాలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమవుతున్నాయి. ప్రభుత్వాల వివక్షతతో గిరిజనులు ఇంకా చీకట్లోనే మగ్గిపోతున్నారు. మరోపక్క కార్పొరేట్‌ల మైనింగ్ మాఫియా గిరిజన ప్రాం తాలలో పెత్తనం చెలాయిస్తూ, అడవిలోని సహజ, ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు.

1996లో కేంద్రం, 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏజన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని షెడ్యూల్ పంచాయితీరాజ్ యాక్ట్ (పెసా)ను, సుదీ ర్ఘకాలం తరువాత 2011లో వాటి నిబంధనలను తీసుకొచ్చింది. ఏజన్సీ ప్రాంతాల్లో ‘పెసా’ కమిటీల నిర్వహణ, గ్రామసభ తీర్మానాలు పకడ్బందీగా అమలు జరగకపోవడంతో గిరిజనులకు స్వయంపాలన స్వప్నం దూరమైపోయింది.

మైనింగ్ మాఫియాకి ఏజెన్సీలో ఇసుక ర్యాంపులు సాధించుకోవడం కోసం, బినామీలతో ఎరువులు(ఫర్టిలైజర్), మద్యం దుకాణాలు, పెట్రోల్ బంక్‌ల నిర్వహణ కోసం బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడేలా మాత్రమే ‘పెసా’ చట్టాన్ని ప్రభుత్వం, అధికారులు గుర్తిస్తున్నారు తప్ప, గిరిజన గ్రామాల్లో అభివృద్ధిని సాధించడానికి వారు తాపత్రయం పడక పోవడం బాధాకరం.

ఈ చట్ట నిబంధనల ప్రకారం స్థానిక గ్రామాల్లోని  ఆదివాసులకు అక్కడి ఖనిజ, సహజ, అటవీ సంపదలపై పూర్తి హక్కులు కల్పించబడ్డా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా నేటికీ నిరక్షరాస్యత, ఆనాగరికత, అంధకారంలో అర్ధాకలితో ఆదివాసీలు బతుకులీడుస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను అమలు పరచి ఆదివాసీల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి.

తాటి మధు