calender_icon.png 8 January, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన దర్బార్ దరఖాస్తులను తప్పక పరిష్కరించండి

06-01-2025 07:54:54 PM

భద్రాచలం (విజయక్రాంతి): సుదూర మారుమూల గిరిజన గ్రామాల నుండి గిరిజన దర్బార్లో తమ సమస్యల గురించి విన్నవించుకోవడానికి వచ్చే గిరిజనుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి గిరిజనులకు ఐటీడీఏ ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అధికారిక పనులపై వెళ్లినందున వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 

ఎక్కువ శాతం దరఖాస్తులు పోడు భూముల పట్టాలు ఇప్పించుట కొరకు, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, పంట పొలాలలో సోలార్ విద్యుత్ కనెక్షన్ ఇప్పించుట కొరకు, ట్రైకార్ ద్వారా అందించే సబ్సిడీ రుణాల కొరకు, కొత్తగా ఏర్పాటు చేసే మత్స్యకార సొసైటీల అనుమతి కొరకు, వ్యవసాయానికి సంబంధించి కరెంటు, బోరు, మోటారు కొరకు, గిరిజన గ్రామాలలో విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాలు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపాధి పొందుటకు శిక్షణలు ఇప్పించుట కొరకు, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, మరియు కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్ లు, పెట్టుకోవడానికి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించుట కొరకు,పెట్టుకున్నారని ఆయన అన్నారు. 

గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఎస్.ఓ భాస్కరన్,ఏపీఓ పవర్ ఏఈ మునీర్ పాషా, డి టి ఆర్ ఓ ఎప్ ర్ లక్ష్మీనారాయణ, ఎఫ్ డి సి ఉదయ్ కుమార్, మేనేజర్ ఆదినారాయణ, వివిధ విభాగాలకు చెందిన నవ్య, సౌమ్య, విజయకుమార్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.