19-03-2025 05:08:59 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటిడిఏ కార్యాలయం ముందు బుధవారం గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ ధర్నాకు దిగారు. ఈ నెల 17 నుంచి సమ్మెకు దిగిన వర్కర్లు, ఐటీడీఏ కార్యాలయం ముందు తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసన తెలిపారు. జీవో నం. 64 అమలును వెంటనే రద్దు చేయాలని, జిల్లా కలెక్టర్ నిర్ణయించిన కనీస వేతనాల ప్రకారమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 25 ఏళ్లుగా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు అందుతున్నాయని, అదే విధంగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు.
జీతాల్లో భారీ కోతపై ఆవేదన..
గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వేతన జీవుల జీవనోపాధి కష్టాల్లో పడిందని వర్కర్లు వాపోయారు. కొత్త జీవో అమలుతో వారికి కేవలం 11,000 మాత్రమే జీతం వస్తుందని, అయితే జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం 28,000 వరకు లభించేవని తెలిపారు. జీవో నం. 64 అమలు చేస్తే ఒక్కో వర్కర్‌కు సుమారు 15,000 వరకు జీతం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్..
వేతనాలను మునుపటి విధంగానే చెల్లించాలని, లేకపోతే తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వర్కర్లు హెచ్చరించారు. అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు ఐటిడిఏ కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తామని వారు తెలిపారు.