calender_icon.png 15 April, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాణా కేసులో దర్యాప్తు ముమ్మరం

13-04-2025 11:02:42 PM

కొనసాగుతున్న విచారణ

కీలకం కానున్న ఆనాటి కాల్ రికార్డులు!

వె న్యాయస్థానం అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న 26/11 ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. రాణాపై ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విచారణలో భాగంగా రాణా వాయిస్ నమూనాలను సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. ముంబై ఉగ్రదాడి సమయంలో రాణా మాట్లాడాడని అనుమానిస్తున్న పలు కాల్ రికార్డులతో పోల్చి చూసి ఆనాడు మాట్లాడింది రాణానేనా అని ధ్రువీకరించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. ఇందుకోసం నిందితుడి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అతడు అందుకు నిరాకరించి సందర్భంలో కోర్టు అనుమతితో ముందుకు సాగాలని అధికారులు భావిస్తున్నారు. 

దాడులకు వారం ముందే..

ముంబై దాడులకు వారం రోజుల ముందే ముంబైకి వచ్చినట్లు రాణా ఒప్పుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ముంబై దాడుల ప్రధాన కుట్రదారులైన లఖ్వీ, సాజిద్ మీదర్, పాక్‌కు చెందిన కశ్మీరీ, రెహమాన్‌ల గురించి అధికారులు రాణాను ప్రశ్నిస్తున్నారు. రాణా ఉన్న గదిని ఎన్‌ఐఏ అధికారులు 24 గంటల పాటు నిరంతర నిఘాను ఉంచారు. భారత్‌కు రాకుండా ఉండేందుకు తహవూర్ రాణా విశ్వప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అతడు మాత్రమే కాకుండా అతడి తరఫు న్యాయవాది కూడా రాణా భారత్‌కు రాకుండా ఉండేందుకు శతవిధాలాల ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ‘రాణాను భారత్‌కు పంపిస్తే వారు చిత్రహింసలు పెడతారని, అదీ గాక రాణాకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.’ అని రాణా న్యాయవాది అమెరికా విదేశాంగ శాఖకు లేఖ రాశాడు. కానీ అమెరికా విదేశాంగ శాఖ అందుకు ఒప్పుకోకపోవడంతో రాణా భారత గడ్డకు రావాల్సి వచ్చింది.