calender_icon.png 27 November, 2024 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వణికిస్తున్న చలి బేలలో 9.2డిగ్రీలకు తగ్గుదల

27-11-2024 04:53:35 AM

రాష్ట్రంలో పలు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్/కరీంనగర్/కామారెడ్డి, నవంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో గతంలో కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో మంగళవారం అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 9.3 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 9.8 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేట్‌లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న ఐదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యల్పంగా భెల్‌లో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. గతేడాది కంటే ఈ ప్రాంతాల్లో ఈసారి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.

కామారెడ్డి జిల్లా మద్నూర్, నస్రూల్లాబాద్ మండలం బొమ్మందేమోనపల్లి గాంధారిలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జుక్కల్‌లో 10.9, కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నిజామాబాద్ జిల్లా కొటగిరి మండలంలో10.9, నిజామాబాద్ గుపాన్‌పల్లిలో 11, దక్షిణ మండలంలో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లాలో 14.5 సాధారణ ఉష్ణోగ్రత కాగా 12.5 డిగ్రీలుగా నమోదయింది. జగిత్యాల జిల్లా ఎండపల్లిలో అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.