15-04-2025 12:00:00 AM
వరి, మామిడి రైతులకు నష్టం
కోదాడ, ఏప్రిల్ 14: నియోజకవర్గంలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు విద్యుత్ స్తంభాలు చాలా వరకు నేలకొరిగాయి. ఇప్పటికే అనేక కారణాలతో దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతుకు ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మామిడికాయ పంట పూర్తిగా నేల రాలడమే కాకుండా మామిడి చెట్లు వేళ్లతో సహా నేలకు ఒరిగాయి.
వరి వేసిన రైతులు తీరా కోతకు వచ్చిన సమయంలో పైరు మొత్తం నేలకొరిగింది. పంట చేతికి వచ్చే దశలో రైతులకు తీరని నష్టం జరిగింది. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. నల్లబండగూడెం, కాపుగల్లు, కూచిపూడి, తొగర్రాయితో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి, మామిడి పంట నష్టం జరిగింది.