23-04-2025 01:14:23 AM
మునుగోడు, ఏప్రిల్ 22 : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ పంట నమోదు ప్రక్రియ లేక పంటలు ఎండి కొందరు.. పండిన పంట అమ్ముకోలేక మరికొందరు రైతులు కల్లాల్లో వడ్లు పోసి వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది.
మునుగోడు మండల వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉండటంతో రైతులు నీటి వసతి ఉన్నచోట వరి సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయానికి నీటి ఎద్దడి వచ్చి సాగు చేసిన పంటలో సగం వరకు ఎండిపోయింది. మిగిలిన పంటను అమ్ముకునేందుకు కూడా రైతులకు అవస్థలు తప్పట్లేదు.
ఓపీఎంఎస్ ఇబ్బందులు
ధాన్యం సేకరణలో మధ్యవర్తుల జోక్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఆన్లున్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (%ంఆఐ%)ని అభివృద్ధి చేసింది. ఈ ప్రక్రియ ద్వారా ఆలస్యం లేకుండా నేరుగా రైతు ఖాతాలకు ధాన్యంకు సంబంధించిన నగదు చెల్లింపు పూర్తవుతుంది. అయితే ఈ వ్యవస్థలో పంటల నమోదు ప్రక్రియను చేసుకునేందుకు మండల వ్యవసాయ అధికారికి ప్రభుత్వం లాగిన్ ఏర్పాటు చేసింది.
పంట నమోదు వివరాలు నమోదు కాని రైతులు సంబంధిత వ్యవసాయ అధికారుల వద్ద కావాల్సిన ధ్రువపత్రాలను అందజేసి పంటలను నమోదు చేయించుకుంటారు. కానీ, రైతుల పంటల వివరాలు నమోదు చేసుకునేందుకు వ్యవసాయ అధికారులు కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోతుంది.
మండల వ్యవసాయ అధికారిని దృష్టికి ఏఈవోలు పదేపదే సమాచారాన్ని తీసుకువెళ్లిన తిరస్కరించినట్టు, ఏఈవోలు ఏమి చేసేది లేక జిల్లా వ్యవసాయ అధికారికి సమాచారం విశ్వనీయ సమాచారం. వ్యవసాయ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా నమోదు ప్రక్రియని చేసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర పొందేందుకు సహకరించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
పంట నమోదు కోసం ఐదు రోజులుగా చూస్తున్న...
-ఆన్‌లైన్‌లో పంట నమోదు కాక ఐదు రోజుల నుంచి వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు అందజేశాను. నేటికీ నమోదు కాలేదు. కల్లాల్లో వడ్లు పోసి తేమశాతం వచ్చిన వడ్లు తరలించే పరిస్థితి లేదు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో ఎప్పుడేం జరుగుతుందోనని భయపడవలసి వస్తున్నది. వడ్లు తడిస్తే రైతుల పరిస్థితి ఏంటి?. వ్యవసాయ అధికారులు తక్షణమే పంట నమోదు ప్రక్రియని నమోదు చేపట్టాలి.
కృష్ణారెడ్డి ,కొంపల్లి రైతు