calender_icon.png 26 November, 2024 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలమైన గాలులకే చెట్లు కూలాయి

25-09-2024 03:08:48 AM

  1. 332 హెక్టార్లలో నేలకొరిగిన 50 వేల చెట్లు  
  2. అక్కడ వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు 
  3. పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియల్ వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల కారణంగానే ములుగు జిల్లాలోని తాడ్వాయి అటవీ ప్రాంతంలో 332 హెక్టార్లలో 50 వేల చెట్లు నేలకొరియగాని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ (పీసీసీఎఫ్) ఆర్ డోబ్రియల్ తెలిపారు.

సంఘటన జరిగిన ప్రదేశంలో స్థానిక ప్రజలు, పశువులు, నిప్పు నుంచి పూర్తిగా సంరక్షించాలని, ఆ ప్రాంతంలో పెరిగే వృక్ష జాతులను కూడా సంరక్షిస్తామని తెలిపారు. తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన పర్యావరణ విపత్తుపై మంగళవారం అరణ్య భవన్‌లో వర్క్‌షాప్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డోబ్రియల్ మాట్లాడుతూ.. విపత్తు జరిగిన ప్రాంతంలో ఉండే వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చెట్లు నేలకొరిగిన ప్రాంతాల్లో కలుపు మొక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని, తద్వారా చెట్లు త్వరగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

వేర్లు లోతుగా వెళ్లకపోవడమే కారణం

తాడ్వాయి అడవుల్లో నేలకొరిగిన చెట్లపై ములుగు డీఎఫ్‌వో రాహుల్ కిషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘విపత్తు జరిగిన రోజు అక్కడ విపరీతమైన గాలులు, భారీ వర్షం ఒకే చోట కురవడం వల్ల కేవలం ఆ ప్రాంతంలోనే ఎక్కువ నష్టం జరిగింది.

బంగాళాఖాతం, ఆరేబియా సముద్రంలో రెండు ప్రాంతాల్లో  ఒకేసారి వాయుగుండం సంభవించడం వల్లే ఇక్కడ గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలి వీచిందని వాతావరణ నిపుణులు తెలిపారు. అక్కడున్న సారవంతమైన నేల కూడా ఈ విపత్తుకు మరో కారణం. అక్కడి నేలలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల ఆ చెట్టు వేర్లు భూమిలోకి లోతుగా కాకుండా అడ్డంగా వెళ్లడం వల్ల చెట్లు పడిపోవడానికి కారణమై ఉండొచ్చు’ అని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఎస్ నుంచి ఎంవీ రమణ, ఎన్‌ఏఆర్‌ఎల్ నుంచి డాక్టర్ అమిత్, పీ కేసర్కర్, ఎన్‌జీఆర్‌ఐ నుంచి శాస్త్రవేత్త తన్వి అరోరా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎండీ నుంచి డాక్టర్ నాగరత్నం, ఎన్‌జీఆర్‌ఐ నుంచి షకీల్ ఆహ్మద్, పీసీసీఎఫ్‌లు సువరణ, సునీతా భగవత్, ఇతర అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.