13-04-2025 01:22:59 AM
ఖమ్మం, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): కాంక్రీట్ జనారణ్యంలో లోకమంతా పచ్చదనంతో పది కాలాలు చల్లగా ఉండాలని చిన్నతనం నుంచే మొక్కలను పెంచుతున్న ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య(87) ఇక లేరు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.
ఖమ్మం రూరల్ మండ లం రెడ్డిపల్లికి చెందిన రామయ్య శనివారం ఉదయం నిద్ర నుంచి ఎంతకీ లేవకపోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి గుండెపోటుతో అప్పటికే మృతి చెందారని చెప్పారు. కాగా ఆదివారం రెడ్డిపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వనజీవి రామ య్యకు భార్య జానకమ్మ నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. రామయ్య ఇంటి పేరు దరిపల్లి. అయితే మొక్కలంటే ప్రాణం కావడంతో ఆయన వనజీవి రామయ్యగా స్థిరపడిపోయారు. రామయ్య మృతిపట్ల ప్రధాని మోదీ, సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం ప్రకటించారు.
మొక్కలంటే ప్రాణం
అయిదో తరగతి వరకు చదువుకున్న రామయ్యకు మొక్కలంటే ప్రాణం. గత 50 ఏళ్లుగా భార్య జానకమ్మతో కలిసి అలుపెరగకుండా మొక్కలు పెంచారు. తొలుత తన టీచర్ మల్లేశం ఇచ్చిన స్ఫూర్తితో తనకున్న కొద్ది భూమిలోనే మొక్కలు పెంచడం ప్రారంభించాడు.
తర్వాత ఎక్కడ ప్రభుత్వ భూమి, ఖాళీ స్థలం కనిపించినా మొక్కలు నాటేవారు. విత్తనాలు చల్లేవారు. ఇలా కోటికి పైగానే మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. మూడు కోట్ల మొక్కలు నాటాలన్నది ఆయన లక్ష్యంగా ఉండేది. ఆ లక్ష్య సాధనకు శ్రమిస్తున్న క్రమంలోనే మన నుంచి ఆయన దూరమయ్యారు.
నిరాడంబర జీవితం
తొలుత సైకిల్ ద్వారా ఊరూరా తిరిగి పర్యావరణం, మొక్కలు పెంపకం గురించి ప్రచారం చేసిన రామయ్య ఆ తర్వాత ప్రభుత్వం ద్విచక్ర వాహనాన్ని సమకూర్చడంతో దానిపై వెళ్లి మొక్కలు నాటడం ప్రారంభించారు. వన రక్షణపై దాదాపు వేయి వరకు వన సూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చిత్రాలను చెక్కారు.
చనిపోయేంతవరకు కూడా నిరాడంబర జీవితాన్ని గడిపిన రామయ్య ఎటువంటి ఆస్తిపాస్తులు కూడబెట్టలేదు. తనకున్న చిన్న ఇంటిలోనే ఉంటూ జీవించారు. ఏ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమం జరిగినా అక్కడ రామయ్య దంపతులు ప్రత్యక్షమయ్యేవారు. “వృక్షో రక్షితి రక్షితః” అని రాసిన గుండ్రటి చక్రాన్ని మెడకు చుట్టుకుని ఉండేవారు.
మొక్కలు, చెట్ల మీద ఉన్న ప్రేమ వల్ల ఆయన తన కుటుంబ సభ్యుల పిల్లలకు కూడా మొక్కల పేర్లే పెట్టారు. దాదాపు 150 రకాల మొక్కల గురించి ఆయన ఇట్టే చెబుతారు. కుటుంబసభ్యులకు మొక్కల ఆకుల తోనే వైద్యం చేసేవారు.
పాఠ్యాంశంగా రామయ్య జీవితం
రామయ్య సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయన జీవితం గురించి విద్యార్థులకు తెలిసేందుకు పాఠ్యాంశాన్ని చేర్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడి తెలుగు విద్యార్థుల కోసం తొమ్మిదో తరగతి పుస్తకంలో రామయ్య జీవితం గురించి పాఠ్యాంశం గా చేర్చారు. ఎటువెళ్లినా ఆయనకు భార్య జానకమ్మ చేదోడువాదోడుగా ఉండేది. ఆయనతోనే బండి మీద వెళ్లి, మొక్కలు పెంప కం, పర్యావరణం గురించి ప్రచారం చేసేది.
ఎన్నో అవార్డులు రామయ్య సొంతం
కోటి మొక్కలు నాటిన సందర్భంగా ఆయ న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు పొందిన రామయ్యకు యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే సంస్థ గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. అలాగే అనేక సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయన్ని గౌరవించి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాయి.
పచ్చదనానికి తీరని లోటు: కేసీఆర్
పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా జీవించిన వ్యక్తి పద్మశ్రీ వనజీవి దర్పల్లి రామయ్య అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. వనజీవి రామయ్య మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ సంతాపాన్ని తెలిపారు. పచ్చదనం పరిరక్షణ కోసం వనజీవి రామయ్య చేసిన కృషిని స్మరించుకున్నారు.
వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకొని కోటికి పైగా మొక్కలు నాటి పచ్చదన ప్రాముఖ్యాన్ని ప్రచారం చేసిన మహో న్నతి జీవి అని కేసీఆర్ కొనియాడారు. తాము ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారానికి రామయ్య అందించిన సహకారం మరువలేనిదని కేసీఆర్ అన్నారు. వనజీవి మరణంతో తెలంగాణ ప్రపంచ పర్యావరణ వేత్తను కొల్పోయిందన్నారు.
తెలంగాణకు తీరని లోటు: కేటీఆర్, హరీశ్, కవిత
వనజీవి రామయ్య మృతిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. ప్రకృతి మాత ముద్దుబిడ్డ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా బతికిన వ్యక్తి పద్మశ్రీ వనజీవి దర్పల్లి రామయ్య మరణం తెలంగాణకు తీరని లోటని కేటీఆర్ అన్నారు. చట్టాలు పాటించకుండా పాలకులే అడవులను నరుకుతున్న నేటి రోజుల్లో వనజీవి లాంటి వాళ్ల అవసరం ఎంతో ఉందన్నారు. వృక్షోరక్షతి రక్షతః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకున్న ‘కోటీ’శ్వరుడు వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కవిత వాపోయారు.
పర్యావరణ పరిరక్షణలో ఆయన చాంపియన్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ
పర్యావరణ పరిరక్షణలో వనజీవి రామయ్య ఓ చాంపియన్ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. లక్షల మొక్కలను నాటేందుకు ఆయన జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు. భవిష్యత్తు తరాల కోసం అలుపెరుగని పోరాటం చేశారని పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో యువతకు ఆయన స్ఫూర్తి అని అన్నారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రధాని తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ ఆయనకు ఘన నివాళి అర్పించారు.
నిజమైన భూమి పుత్రుడు వనజీవి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నిజమైన భూమి పుత్రుడు వనజీవి రామయ్య అని జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. పర్యావరణ రక్షణ పట్ల ఆయన ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరించారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపైన వారి కృషి ఎనలేనిదని కొనియాడారు. తెలంగాణకు వనజీవి లేని లోటు తీర్చలేనిదని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరలని కోరుతున్నట్టు చెప్పారు.