calender_icon.png 19 April, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు రోజుల పసికందుతో గోదావరిఖని ఆస్పత్రికి..

17-04-2025 02:46:58 PM

భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన వ్యక్తికి దత్తత ఇచ్చిన మహారాష్ట్ర దంపతులు..

విచారణ చేపట్టిన పోలీసులు..

బాలల సంరక్షణ అధికారి సమక్షంలో పసికందుకి చికిత్స...

గోదావరిఖని (విజయక్రాంతి): అపస్మారక స్థితిలో ఉన్న  ఆరు రోజుల పసికందుతో ఓ దంపతులు గోదావరిఖని ప్రభుత్వ దవాఖానాకు వచ్చిన సంఘటన దుమారం రేపింది. ఆ పసికందును జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన ఓ వ్యక్తికి దత్తత ఇస్తున్న క్రమంలో శిశువు అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించి గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తీసుకురాగా ఆసుపత్రి వర్గాలు కలవరపడ్డారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఆ విషయాన్ని గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ఇంద్రసేనారెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని ఆ పసికందును తీసుకవచ్చిన దంపతులను తనదైన శైలిలో విచారించారు. దాంతో  శిశువును మరో వ్యక్తికి దత్తత ఇచ్చినట్లు దంపతులు అంగీకరించారు. మహారాష్ట్రలోని బల్లార్షాకు చెందిన రవీంద్ర - దుర్గం అనే భార్య భర్తలు కూలి నాలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

వారికి ఇదివరకే ముగ్గురు సంతానం. నాలుగవ సంతానం కలిగితే ఎవరికైనా దత్తత ఇద్దామని అనుకున్నారు. భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన ఓ వ్యక్తి తనకు పెంచుకోవడానికి ఒక బిడ్డ కావాలని మంచిర్యాల జిల్లాకు చెందిన మధ్యవర్తిని ఆశ్రయించాడు. దీంతో సదరు మధ్యవర్తి బల్లర్షకు చెందిన ఆ దంపతుల వద్ద ఆరు రోజుల పసికందు ఉన్నట్లు తెలుసుకొని వారిని సంప్రదించారు. ఆ నవజాత శిశువును  దత్తత ఇచ్చేందుకు అంగీకరించి మంచిర్యాలకు చేరుకున్నారు. అప్పటికే కాటారంకు చెందిన ఆ వ్యక్తి మంచిర్యాలకు వచ్చి ఉండడంతో ఆ పసికందును తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఆ శిశువు అనారోగ్యంతో ఉన్నట్లు  గుర్తించి మార్గమధ్యంలో గోదావరిఖనిలోని  ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చారు.

ఆసుపత్రి వర్గాలకు పొంతన లేని వివరాలు చెబుతుండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఆ పసికందును ఎక్కడి నుంచి అయినా తీసుకు వస్తున్నారా..? లేక దత్తత తీసుకున్నారా? విక్రయించారా ? అన్న కోణంలో  బాలల సంరక్షణ అధికారి సమక్షంలో పోలీసులు విచారణ చేయగా, ఆ దంపతులు తామే దత్తత ఇచ్చామని అంగీకరించారు. అయితే పసికందు అనారోగ్యంగా ఉండడంతో జిల్లా సంరక్షణ అధికారి సమక్షంలో దవాఖానలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. శిశువు పూర్తిగా కోలుకున్నాక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా... భూపాలపల్లి జిల్లా కాటారం చెందిన సదరు వ్యక్తి పెంచుకోవడానికి అప్పుడే పుట్టిన బిడ్డ కోసం మంచిర్యాలకు చెందిన మధ్యవర్తిని సంప్రదించడం... సదరు మధ్యవర్తి మహారాష్ట్రకు చెందిన ఆ దంపతులను సంప్రదించడం... వారు ఆ శిశువును తీసుకొని ఇటు రావడం వెనుక ఇంకేమైనా వ్యవహారంఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.