calender_icon.png 20 October, 2024 | 2:50 AM

ఏజెన్సీకి అందని వైద్యం

20-10-2024 12:41:01 AM

* ఆసుపత్రుల్లో అందుబాటులో లేని వైద్యులు

* సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి

* మృతదేహం తరలింపునకు అంబులెన్సూ లేని వైనం

 అక్టోబర్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో నేటికి గిరిజనులు సకాలంలో వైద్యానికి నోచుకోవడం లేదు. సరైన సమయంలో వైద్యం అందక చర్ల మండలం లెనిన్ కాలనీకి చెందిన ఆరు నెలల చిన్నారి శనివారం మృతిచెందింది. లెనిన్ కాలనీకి చెందిన మిచ్చా నాగరాజు, కృష్ణవేణి దంపుతుల 6 నెలల వయస్సున్న కూతురుకు శుక్రవారం సుస్తిచేసింది. చిన్నారిని చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లా రు. అక్కడి వైద్యులు పరీక్షించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి  రిఫర్ చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి శుక్రవారం మ ధ్యాహ్నం 2 గంటలకు వెళ్లారు. ఆసుపత్రిలో డ్యూటీ వైద్యుడు లేక పోవడంతో భద్రాచలంలోని పలు ప్రవేటు ఆసుపత్రుల వెంట తిరిగారు. అక్కడ కూడా వైద్యులు లేకపోవడంతో తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు. అప్పటికీ వైద్యులు డ్యూటీకి రాకపోవడంతో అక్కడే నిరీక్షిస్తూ ఉన్నారు.

శనివారం ఉద యం వరకు కూడా డాక్టర్లు రాకపోవడంతో ఆ చిన్నారి ఆసుపత్రిలోనే మృతి చెందింది. చివరకు మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఆసుపత్రిలో అంబులెన్సు లేక పోవడంతో మణుగూరు నుంచి అంబులెన్సు తెప్పించి ఇంటికి పంపారు. సకాలంలో వైద్యం అంది ఉంటే తమ చిన్నారి బతికేదని, వైద్యులులేక శవమై ఇంటికి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిని విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఈ ఘటనతో నిజమయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.