19-03-2025 12:08:48 PM
అశ్వారావుపేట,(విజయక్రాంతి): మారుమూల ప్రాంతం, కొండ కోనల్లో నివసించే ఆదివాసి గిరిజనులకు సేవ చేసుకునే అవకాశం అధికారులకు దక్కిందని అటువంటి అధికారులు కార్యాలయాలకు వచ్చే గిరిజనుల పట్ల మర్యాద పూర్వకముగా పలకరించి వారి సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తే జీవితాంతం గిరిజనులు మిమ్మల్ని దేవుళ్ళ భావిస్తారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మంగళవారం కావడిగుండ్ల, గాండ్ల గూడెం కొండరెడ్ల గ్రామంలలో ఏర్పాటుచేసిన గ్రామసభలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ కోనల్లో నివసించే గిరిజనులకు అడవులపై పూర్తి ఆధిపత్యం ఉందని అందుకు ఫారెస్ట్ అధికారులు అడ్డు చెప్పరాదని, అడవులలో దొరికే అటవీ ఫలాలతో మొదలుకొని ప్రతి అంశంలో వారికి హక్కు ఉంటుందన్నారు. కొండరెడ్ల గిరిజనులు నివసించే ఆవాసాలలో తప్పనిసరిగా రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పించడానికి ఫారెస్ట్ అధికారులు తప్పనిసరిగా సహకరించాలన్నారు.
ఫారెస్ట్ చట్టంలో ఏమైనా లోసుగులు ఉంటే గిరిజనుల సౌకర్యార్థం సవరించాలని, 9 కొండ రెడ్ల గ్రామాలలో ఉన్న గిరిజనులకు రోడ్డు, కరెంటు సౌకర్యం ఒక నెలలో పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, 152 సర్వే నంబర్ కింద 3,372 ఎకరాల పొలం గిరిజనులకు సాగు చేసుకోవడానికి సమస్యగా ఉన్నందున దానికి సంబంధించిన సమస్యను కూడా 15 రోజుల్లో పరిష్కరించాలని, కొత్తగా చెక్ డ్యాములు నిర్మాణానికి మూడు నెలల్లో ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. గిరిజనులు కోరిన ప్రకారము మినీ ఐటీడీఏ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని, తండాలో గూడాలలో గిరిజనులకు విద్యుత్ కనెక్షన్ కొత్త కరెంట్ పోల్స్ నిర్మాణం, పోడు పట్టాలు ఉన్నవారికి గిరివికాసం ద్వారా కరెంటు, బోర్లు మోటార్లు ఇప్పించాలన్నారు.
పాఠశాలలో పదవ తరగతి పూర్తి అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువు కోసం కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు విద్యాశాఖ వారికి పంపించాలని, ఈఎంఆర్ఎఫ్ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తున్నందున విద్యార్థులను చేర్పించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం ఆర్టిసి ఎండి సజనర్ తో మాట్లాడి వారం రోజుల్లో బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తానన్నారు. దేశంలో 12 కోట్ల గిరిజనులు నివసిస్తున్న తండాలను అభివృద్ధి దిశలో తీసుకు వెళ్ళడానికి ఎస్టి కమిషన్ కేంద్ర ప్రభుత్వం నియమించిందని అందుకు గిరిజనులు ఏ సమస్య ఉన్న వెంటనే ప్రత్యేక వెబ్సైట్ www.ncst.nic.in లేదా jatothu hussain @ncst.nic.in ద్వారా దరఖాస్తు తో పాటు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా రాసి తనకు తెలియజేయాలని మీ సమస్యను తప్పనిసరిగా పరిష్కరిస్తానన్నారు. అంతకుముందు కావడి గుండ్లలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమం పాఠశాలను సందర్శించి గిరిజన విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పిస్తామని, ప్రస్తుతం ఈ పాఠశాలలో డైనింగ్ హాల్ కిచెన్ డార్మెటరీ విద్యార్థినీ విద్యార్థులకు తరగతి గదులు సరిపడా లేవని తన దృష్టికి వచ్చినందున గ్రామస్తులు 5 ఎకరాల స్థలం ఇస్తున్నందున వెంటనే వాటికి సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేసి పాఠశాల నిర్మాణం కొరకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మాట్లాడుతూ కావడి గుండ్ల, గాండ్ల గూడెం గ్రామాలలోని గిరిజన రైతులకు సంబంధించిన పోడు పట్టాలు దాదాపు 60 మంది గిరిజనులకు అందించడం జరిగిందని ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి తప్పనిసరిగా సర్వే చేయించి అందిస్తామని, పోడు పట్టాలు ఉన్న గిరిజన రైతులకు కరెంటు బోరు మోటారు అందించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అందరికీ అందేలా చూస్తామన్నారు.త్వరలో గిరిజన యువతి యువకుల సౌకర్యార్థం దమ్మపేట, అశ్వరావుపేటలలో జాబ్ మేళా నిర్వహిస్తామని, గాండ్ల గూడెం నుండి చెన్నాపురం వెళ్లడానికి 5 కిలోమీటర్ల మీద రోడ్డు వేయడానికి డిసెంబర్ మాసంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించడం జరిగిందని, ప్రతిపాదనలో రాగానే ఫారెస్ట్ వారి క్లియరెన్స్ తీసుకొని రోడ్డు నిర్మాణం పూర్తిచేసి తొందర్లోనే బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. దమ్మపేటలో మినీ గిరిజన దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జివిఆర్ ట్రస్ట్ చైర్మన్ జలగం ప్రసాదరావు, ఎఫ్ డి ఓ దామోదర్ రెడ్డి, ఎస్సీ ఎన్పీడీసీఎల్ మహేందర్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, తాసిల్దార్ కృష్ణ ప్రసాద్, ఏ టి డి ఓ చంద్రమోహన్, మాజీ సర్పంచులు భూలక్ష్మి, చిలకమ్మా, డి ఈ బాపనయ్య, ఏఈ ప్రసాద్ మరియు ఇతర శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.