calender_icon.png 15 October, 2024 | 6:51 PM

కూల్చివేత నోటీసులను షోకాజ్‌గా పరిగణించండి

03-09-2024 01:01:53 AM

దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమణల తొలగింపుపై హైకోర్టు

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మాణాల తొలగింపు నిమిత్తం ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసుల ఆధారంగా పిటిషనర్లు సమర్పించే పత్రాలను, ఆధారాలను పరిశీలించి చట్టప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించింది. గుట్టబేగంపేటలో 15 ఎకరాల్లో వేసిన లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి వాల్టా చట్టంలోని సెక్షన్ 23 కింద డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో 4 పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. 1998లో లేఅవుట్లో ప్లాట్లు కొను గోలు చేసి నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇప్పుడు అవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ నోటీసులు జారీ చేశారన్నారు. కనీసం తమ వివరణ కూడా తీసుకోకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇప్పటికే జారీ చేసిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణిస్తామని, పిటిషనర్లు అభ్యంత రాలను తెలియజేయవచ్చన్నారు.

ఆ తరువాతే చట్టప్రకారం ముందుకెళతామని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పిటిషనర్లు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లలో నిర్మాణాలు, అభ్యర్థనలు వేర్వేరు అయినా ఎఫ్టీఎల్ ప్రాంతంలోని నిర్మాణాలను తొలగించాలన్నదే నోటీసుల్లో ప్రధానంగా ఉందని పేర్కొంది. అంతేగాకుండా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా కూల్చివేత నోటీసులు ఇవ్వడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ జారీ చేసిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణించి అధికారులకు అన్ని ఆధారాలను సమర్పించి వివరణ ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తరువాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను మూసివేసింది.