calender_icon.png 16 March, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహసం

16-03-2025 12:41:01 AM

రంగం ఏదైనా మహిళలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. తగిన ప్రోత్సాహం, అండదండలు లేకున్నా సాహసాలకు సైతం సిద్ధమంటున్నారు. 45 ఏళ్ల వయస్సులోనూ ప్రపంచాన్ని సైతం చుట్టి రాగలమని నిరూపిస్తున్నారు. ఒకవైపు ఇళ్లు, ఆఫీసు బాధ్యతలను సమర్థమంతంగా నిర్వర్తిస్తూనే, మరోవైపు అడ్వెంచర్స్ చేస్తూ స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగులెస్తున్నారు.

ఒకప్పుడు మహిళ వంటింటికి మాత్రమే పరిమితమయ్యేవారు. ఆ తర్వాత గడపదాటి మగవారితో సమానంగా ఆయా రంగాల్లో రాణించారు. ఆ తర్వాత మరో అడుగు వేసి నచ్చిన ప్రదేశాలను చుట్టేస్తూ జీవితంలో మరిచిపోలేని అనుభూతులను సొంతం చేసుకుంటున్నారు. అయితే సాధారణంగా మహిళల ట్రావెలింగ్ అంటే సముద్ర తీరాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు,  ఆహ్లాకరమైన ప్రదేశాలు మాత్రమే గుర్తుకువస్తాయి. కాని, సాధ్యం కాని అడ్వెంచర్ చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. అక్వాటెర్రా అడ్వెంచర్స్ అనే టూర్ ఏజెన్సీ 10,000 మంది మహిళలపై  సర్వే చేసింది. ఆ సర్వేలో ఆశ్చర్యకర మైన విషయాలు వెలుగుచూశాయి. 45 ఏళ్ల తర్వాత సాహస యాత్రలను చేయడానికి మొగ్గు చూపుతున్నట్టు తేలింది. అలాగే 50% మంది మహిళలు ఒంటరిగా ప్రయాణాలు చేస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకు సాహస యాత్రల వైపు ఆసక్తి చూపుతున్నారు. 

ఈ వయస్సులోనే ఎందుకంటే..

సాహస యాత్ర అనేది ఇతర ప్రయాణ అనుభవానికి భిన్నంగా ఉంటుంది. ఇది వ్యక్తి శాంతి, ఏకాంతత, వ్యక్తిగత ఎదుగుదలను సూచిస్తుంది. చాలామంది మహిళలు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకు సాహస యాత్రను మంచి అవ కాశంగా భావిస్తున్నారు. అయితే 45 ఏళ్ల తర్వాత ప్రయాణాలు చేయడానికి అనేక కారణాలున్నాయి. ఎక్కువ సమయం, అధిక ఆదా యం, తక్కువ కుటుంబ బాధ్యతలు ఉండటమే అందుకు కారణం. పిల్లలు పెద్దవారై, ఇంటి బాధ్యతలు తక్కువగా ఉండటంతో చాలామంది ఒంటరిగా లేదా వారి స్నేహితులతో ప్రయాణాలు చేస్తున్నారు. 

భద్రతకు ప్రాధాన్యమిస్తూనే..

ఒకవైపు తమ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే, మరోవైపు ఒకే అభిరుచులు ఉన్నవారితో కలిసి ప్రయాణించడానికి ఇష్టం చూపుతున్నారు. మంచి భాగస్వామ్యం దొరికితే మరిన్ని ప్రయాణాలు చేస్తున్నారు. అభిప్రాయ భేదాలో, ఇతర కారణాలో కాని, మనదేశంలో ఒంటరిగా జీవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాంటివాళ్లకు ట్రావెలింగ్ మంచి అవకాశంగా మారింది. సాహసయాత్రలు చేయడం వల్ల జీవితంపై మరింత స్పష్టత వస్తుందంటారు చాలామంది మహిళలు. 

బైక్‌పై 64 దేశాలు చుట్టేసి.. 

ఏడాది కాలంలో అరవై నాలుగు దేశాల్ని బైక్ మీద చుట్టేశారు అసోం రాష్ట్రానికి చెందిన 41 ఏళ్ల ఈ ఫిట్‌నెస్ ట్రైనర్ మీనాక్షి దాస్. ఆమె చిన్నప్పట్నుంచే బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. కూతురు ఆసక్తిని గమనించి తండ్రి హోండా బైక్ నడపడం నేర్పాడు. పదహారేళ్ల వయసులో మొదటిసారి బైక్ నడిపినప్పుడు గొప్ప స్వేచ్ఛ లభించిన అనుభూతిగా పొందింది. అప్పటి నుంచి బైక్ రైడింగ్ ఆమె జీవితంతో భాగమైంది. పెళ్లున తర్వాత కూడా డ్రైవింగ్‌ను విడిచిపెట్టలేదు. భర్తతో కలిసి అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలను చుట్టేసింది. ‘ఒక మహిళ పేరిట 50 దేశాల్లో... బైక్ మీద పర్యటించిన ప్రపంచ రికార్డు ఉందని విన్నాను. నేను 67 దేశాల్లో ప్రయాణించి, ఆ రికార్డును బద్దలుగొట్టడంతోపాటు, మహిళా సాధికారతను చాటి చెప్పాలని నిశ్చయించుకున్నాను.

నా భర్త, కుటుంబం కూడా అంగీకరించారు. 2023 డిసెంబర్ 17న నేపాల్‌కు బైక్‌పై వెళ్లా. ఆ తర్వాత నా బైక్‌ను దుబాయ్ పంపించి, నేను కూడా అక్కడికి విమానంలో వెళ్ళాను. అక్కడి నుంచి నా యాత్ర ప్రారంభమయింది. ఈ ప్రయాణంలో 372 రోజుల్లో 64 దేశాలు పర్యటించాను. 2024 డిసెంబర్ 24న... స్వదేశం చేరుకోవడంతో పూర్తయింది. మయన్మార్, ఒమన్, ఇరాక్ దేశాల్లో కూడా ప్రయాణిస్తే.. నా 67 దేశాల లక్ష్యం నెరవేరేది. కాని భద్రతాపరమైన ఆంక్షల కారణంగా... ఆ దేశాల్లో ప్రవేశానికి అనుమతి దొరకలేదు” అని అంటోంది మీనాక్షి దాస్.