calender_icon.png 21 September, 2024 | 1:58 AM

ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా

21-09-2024 12:04:59 AM

ఇద్దరు నిందితుల  అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఒడిశా నుంచి ఢిల్లీకి తెలంగాణ మీదుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి పేట్‌బషీరాబాద్‌లోని ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన సునీంద్రకుమార్‌కు బెర్హంపూర్‌కు చెందిన రాజు అనే గంజాయి పెడ్లర్‌తో పరిచయం ఏర్పడింది. రాజు గంజాయి రవాణా కోసం సునీంద్రకు చెందిన హోండా సిటీ కారును వినియోగించేవాడు.

ఈ క్రమంలో రాజు సహచరుడు శివ సూచనల మేరకు సునీంద్ర తన కారు పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు కారులో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. వారు కోరిన విధంగా సునీంద్ర తన కారు డిక్కీలో పలు మార్పులు చేయించాడు. ఈ నెల 18న రాజు సూచనల మేరకు శివ, సునీంద్ర కారు డిక్కీలో ఏర్పాటు చేసిన రహస్య ప్రాంతంలో 86 కిలోల గంజాయిని పెట్టుకొని ఢిల్లీకి చెందిన అమిత్ ఆగర్వాల్‌కు డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో సునీంద్ర పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మల్కన్‌గిరి జిల్లాకు చెందిన లక్ష్మిని తన భార్యగా నటించాలని చెప్పి అందుకు కొంత డబ్బు చెల్లించాడు.

పోలీసులకు పట్టుబడినా తన భార్య వైద్యం నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పి తప్పించుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఏపీలోని చింతూరు నుంచి కారులో బయల్దేరిన నిందితులు 19న ఉదయం దుండిగల్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 1 వరకు చేరుకున్నారు. గంజాయి రవాణాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్వోటీ టీమ్, దుండిగల్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని గంజాయి పట్టుకున్నారు. సునీంద్రకుమార్, లక్ష్మిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 33.21 లక్షల విలువైన 86 కిలోల ఎండు గంజాయి, హోండా సిటీ కారు, రెండు సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.   

రెండు ఘటనల్లో మరో ఇద్దరు.. 

నగరంలోని లాలాపేట్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని శుక్రవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా మల్కాన్‌గిరికి చెందిన ఆకాష్‌మాడి 5.1 కిలోల గంజాయిని ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తికి అప్పగించేందుకు వచ్చాడు. సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ ఎస్సై బాలరాజ్ తన సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 2 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో.. కాకినాడ నుంచి నగరానికి గంజాయి దిగుమతి చేసుకుని అమ్మకాలు జరుపుతున్న ఎలిషా బాబు అనే వ్యక్తిని ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అతని నుంచి రూ. 68 వేల విలువైన 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.