- 12 లక్షల ఉద్యోగాలు రోజ్‌గార్ మేళా లక్ష్యం
- ఇప్పటివరకు 10 లక్షల మందికి కొలువులు
- నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): దీపావళి కానుకగా ప్రధాని మోదీ.. రోజ్ గార్ మేళా ద్వారా యువతకు ఉద్యోగా లు కల్పిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రోజ్‌గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మందికి కొలువు లు ఇచ్చినట్టు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ ప్రతిభ ఆధారంగా అత్యంత పారదర్శకంగా నిరుద్యోగులకు దక్కేలా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మెన్స్ క్లబ్ గ్రూప్ సెంటర్, సీఆర్‌పీఎఫ్, చాంద్రాయణగుట్టలో జరిగిన రోజ్ గార్ మేళా కార్యక్రమంలో పాల్గొని 10 కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు.
దేశ సేవలో యువతను భాగస్వామ్యం చేసేలా వారికి ఉద్యోగాలు కల్పించేందుకు రోజ్‌గార్ మేళా నిర్వహిస్తున్నారని.. ఇది 11వదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా సోమవారం సుమారు 71వేల మందికి కేంద్ర ప్రభుత్వం నియామకపత్రాలు అందించిందన్నారు. దీంతో ఇప్పటి వరకు దాదాపు 10 లక్షలమంది కేంద్ర ప్రభుత్వంలోని పలు ఉద్యోగాలకు సంబంధించిన నియామకపత్రాలను అందుకున్నారన్నారు.
దేశంలో ప్రతి నెలా ఉద్యోగ నియామకాలు జరిగేలా ప్రధాని మోదీ ప్రకటించారని.. ఈ నేపథ్యంలో అధికారులు వేగంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని తెలిపారు. 2022 అక్టోబర్ 22న యువతకు దీపావళి కానుకగా రోజ్‌గార్ మేళాను ప్రధాని ప్రారంభించినట్టు కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.
రోజ్‌గార్ మేళా నిరంతర ప్రక్రియ..
రోజ్‌గార్ మేళా నిరంతర ప్రక్రియ అని.. 12 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా పెట్టుకుని దీన్ని పూర్తిచేసే దిశగా కేంద్రం ముందుకెళ్తోందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖలో సుమారు 4 లక్షల ఉద్యోగులున్నారని... రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రైవేట్ రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇవే కాకుండా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని (ఎంటర్-ప్రెన్యూర్-షిప్ క్వాలిటీ) వెలికితీస్తూ.. వారే ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తున్నదన్నారు. జాతీయ విద్యా విధానం విద్యావిధానంలో వినూత్న మార్పులు తీసుకొచ్చినట్టు వివరించారు.
2014లో భారతదేశంలో కేవలం 2 మొబైల్ కంపెనీలు మాత్రమే ఉండగా.. ఈరోజు 99 శాతం మొబైల్స్‌ను భారత్‌లోనే తయారుచేసుకుంటున్నామన్నారు. 5జీ సాంకేతికత అందుబాటులోకి రావడంతో మరిన్ని అవకాశాలు పెరిగాయన్నారు. దీన్ని కూడా యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అమెరికా, యూకే, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు మొత్తం 150 దేశాలకు భారత్ నుంచి సెల్‌ఫోన్స్ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. మోదీ ప్రభుత్వం కృషితో భారత్ ప్రపంచంలోనే ఐదవ ఆర్థికశక్తిగా ఎదిగిందన్నారు. ఉద్యోగాలు పొందిన వారంతా అంకితభావంతో, నీతి నిజాయితీగా దేశానికి సేవలు అందించాలని ఆయన కోరారు.