calender_icon.png 24 January, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా పథకాల అమలు

24-01-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ సిక్తా  పట్నాయక్

నారాయణపేట, జనవరి 23(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఎవరు ఆందోళన చెందవద్దని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం మక్తల్ పట్టణంలోని  కేశవ నగర్ వార్డు  కమిటీ హాల్ లో 3, 7, 11, 15 వార్డులకు సంబంధించిన వార్డు సభను  కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  కొత్తగా అమలయ్యే నాలుగు పథకాల అమలుపై  ఎలాంటి అనుమానాలు,సందేహాలు పెట్టుకోవద్దని చెప్పారు. అర్హత కలిగిన వాళ్ళ పేర్లు జాబితాలో లేకపోతే ఆయా వార్డు సభలలో లేదా  మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రంలో మళ్ళీ పథకాల లబ్ధి కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఏమైనా అభ్యంతరాలు ఉంటే  వార్డు సభలో అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ద్వారా  కొత్త  పథకాల అమలు ప్రక్రియ  నిరంతరం  కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే సభలో కొందరు గతంలో మక్తల్ మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు తమకు జాబ్ కార్డులు ఉండేవని, ఇప్పుడు జాబ్ కార్డులు లేవని, తమకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలని జిల్లా కలెక్టర్ ను వార్డు వాసులు కోరారు.

స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ అక్కడ కొనసాగుతున్న ఆన్ లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భోగిశ్వర్, కార్యాలయ అధికారులు, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.