30-04-2025 12:39:23 AM
నారాయణఖేడ్/ ఆందోల్, ఏప్రిల్ 29 :భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సులలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ మాధురిలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అలాగే ఆందోల్ మండ లం వట్పల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా సదస్సుల్లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ భూభారతి చట్టంతో రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి చట్టం రూపొందించినట్లు తెలిపారు.
భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలం లోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నారాయణఖేడ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, రుణమాఫీ, ఉచిత విద్యుత్, జీరో విద్యుత్ బిల్లు, సన్నాలకు బోనస్, సన్నబియ్యం పంపిణీ, ఉద్యోగ అవకాశాలు కల్పించింది ప్రజా ప్రభుత్వం అని అన్నారు.
గత ప్రభుత్వాలు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధికి దూరంగా ఉంచయన్నారు. ఈ సదస్సులలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, ఆర్డీవో అశోక చక్రవర్తి, రెవిన్యూ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు ప్రజలు, సంబంధిత అధికారులుపాల్గొన్నారు.