calender_icon.png 26 October, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్‌జెండర్లు

14-09-2024 01:09:00 AM

శిక్షణ, ప్రత్యేక యూనిఫాం

ఇండోర్ సిటీ తరహాలో క్లీన్ హైదరాబాద్

అక్కడికి వెళ్లి అధ్యయనం చేసి రండి

పనులు చేయని కాంట్రాక్టర్ల వివరాలివ్వండి

జీహెచ్‌ఎంసీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ ట్రాఫిక్ నియం త్రణకు ట్రాన్స్ జెండర్ల సేవలు ఉపయోగించుకోవాలని అధికారులకు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతోపాటు హోమ్‌గార్డ్స్ ప్రస్తుతం సిటీలో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహిస్తున్నారు. హోమ్‌గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ విధులు అప్పగించాలని సీఎం ఆదేశించారు.

ప్రతినెలా వారికి కొంత స్టుఫైం డ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంతమేరకు ఉపా ధి కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధితో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ విధులు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. వారం, పదిరోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని చెప్పారు. విధుల్లో ఉండే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.

క్లీన్ సిటీగా హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్‌ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధి కారులను సీఎం ఆదేశించారు. మున్సిపల్ వి భాగం అధికారులు ఇండోర్ సిటీకి వెళ్లి అక్కడ అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ఏయే ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు అక్కడ పనుల్లో పాలుపంచుకుంటున్నాయో తెలుసుకొని చర్చలు జరపా లని, వీలైతే వారిని హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని చెప్పారు. రోడ్ల నిర్వహణపై అసంతృప్త్తి

హైదరాబాద్‌లో అయిదేండ్ల క్రితం కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం (సీఆర్‌ఎంపీ) కింద 811 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారని, వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవటం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌తో కాంట్రాక్టు గడువు ముగిసిపోతుందని, అందుకే రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ఆదేశించారు. గడువులోగా అన్ని రోడ్ల పనులను పర్యవేక్షించి, వెంటనే బాగు చేయించాలని చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి 15 రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు. 

చెత్త సేకరణపై పర్యవేక్షణ ఉండాలి

రోడ్లతోపాటు చెత్త సేకరణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అవసర మైతే జీఐఎస్, క్యూఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం సూచించారు. జీహెఎంసీ ఆస్తుల నుంచి వచ్చే అద్దెలు, వాణిజ్య ప్రకటనలు, హోర్డింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయం వస్తుందా.. లేదా కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు. 

మూసీ పనుల్లో వేగం పెంచాలి

మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో సేకరించే స్థలాల్లో ఉన్న నివాసితులకు పునరావాసం కల్పించాలని సూచించారు. ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధ పడకుండా, వారికి భరోసా కల్పించాలని చెప్పారు. 

చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు అప్రోచ్ రోడ్లు

చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను అధునీకరిస్తున్నందున, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్‌కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని, పరిశ్రమల విభా గం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని చెప్పారు. స్టేషన్ ముందు పార్కింగ్, కమర్షియల్ జంక్షన్‌కు వీలుగా అప్రోచ్ రోడ్లు డిజైన్ చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

  1. * భారతదేశ చరిత్రలో తొలిసారి ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ నియామకాల ప్రక్రియను సీఎం ప్రకటించారు.
  2. * ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు.
  3. * ఇది పాలనలో సృజనాత్మక ఆలోచనకు ఉదాహరణ. 
  4. * ఈ నిర్ణయం రెండు కీలక సమస్యలను ఏకకాలంలో పరిష్కరిస్తుంది. ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పన, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది.
  5. * దేశంలోని ఐదు పెద్ద నగరాల్లో హైదరాబాద్‌లోనే అతి తక్కువ ట్రాఫిక్ సమస్య ఉంది. సీఎం నిర్ణయంతో ఈ సమస్య మరింత తగ్గి ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. 
  6. * ట్రాన్స్‌జెండర్ల గుర్తింపు, నియామకం, శిక్షణ తర్వాత వారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అండగా నిలుస్తారు.