calender_icon.png 20 September, 2024 | 3:21 AM

ట్రాన్స్‌ఫార్మర్.. యమడేంజర్

17-09-2024 03:28:18 AM

  1. ఆట స్థలం పక్కనే ఉండడంతో పొంచి ఉన్న ప్రమాదం 
  2. పట్టించుకోని విద్యుత్ అధికారులు

వెల్దుర్తి, సెప్టెంబర్ 16: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంది. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో ఎప్పుడేమి జరుగుతుం దోనన్న భయం వెంటాడుతోంది. వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆటస్థలం పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం వందలాది మంది విద్యార్థులు అక్కడ ఆటలాడుతుంటారు. అయితే, ఆట స్థలానికి, రోడ్డుకు ఆనుకొని ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడినప్పుడు ట్రా న్స్‌ఫార్మర్ చుట్టూ నీరు నిలిచి మడుగులా మారుతోంది. విద్యుత్ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినప్పటికీ దానిచుట్టూ కంచె వేయకుండా వదిలేశారు. దీంతో పశువులు సైతం ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరికి వెళ్తే విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంలో పాఠశాల హెచ్‌ఎం సాంబ య్య పలుమార్లు విద్యుత్ అధికారులకు కంచె ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.