22-12-2024 01:24:53 AM
శేరిలింగంపల్లి, డిసెంబర్ 21: భారతీయ సమాజం ధ్యానం ద్వారా పరివర్తన చెందుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలను శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులతో పాటు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేశ్ పటేల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని మన తెలంగాణలో జరుపుకోవడం మనకు గర్వకారణమని అన్నారు. ధ్యానం అనేది దైవత్వానికి, మానవత్వానికి మధ్య ఒక అద్భుతమైన వారధి అని పేర్కొన్నారు. కన్హా హార్ట్‌ఫుల్ నెస్ సెంటర్ ప్రపంచానికి ధ్యానం ద్వారా పాజిటివిటీని, ఆనందాన్ని అందజేస్తుందని, ఆ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు.
కమలేశ్ డీ పటేల్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ధ్యానం ఎలా చేయాలో తెలిసేది కాదని, కాలానుక్రమంగా నిరంతర సాధన ద్వారా ధ్యానం నేర్చుకున్నానని అన్నారు. ధ్యానం ద్వారా ఆనందం, హృదయంలో ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్ర ప్రజలందరూ ధ్యానం గురించి తెలుసుకోవాలన్నారు. దానివల్ల ప్రతి ఇంటా ఆరోగ్యంతో పాటు శాంతి సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టూరిజం సంచాలకులు జెండగే హనుమంతు కొండిబా, భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.