calender_icon.png 12 December, 2024 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముడుపులిస్తే బదిలీలు రద్దు!

12-12-2024 12:20:30 AM

  1. సింగరేణి ఆర్జీ-1 సివిల్ డిపార్ట్‌మెంట్‌లో ఇష్టారాజ్యం
  2. బదిలీ ఉత్తర్వులు బేఖాతరు

రామగుండం, డిసెంబర్ 11 (విజయక్రాం తి): సింగరేణి రామగుండం-1 డివిజన్ సివిల్ డిపార్ట్‌మెంట్ అవినీతి ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. కార్పొరేట్ కార్యాలయం నుంచి వచ్చిన బదిలీ ఉత్తర్వులను ఇద్దరు ఉద్యోగులు బేఖాతరు చేస్తూ ముడుపులిచ్చి రద్దు చేయించుకునే ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

సివిల్ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమిషన్లకు రుచి మరిగిన సదరు ఉద్యోగులు తమ బదిలీలను రద్దు చేయించుకునేందుకు అధికారు ల చేతులు తడిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం సంస్థ సీఎండీ బలరాంనాయక్ దృష్టికి వెళ్లినట్టు సమాచారం.

గత నవంబర్‌లో సంస్థ వ్యాప్తంగా సివిల్ డిపార్ట్‌మెంట్‌లో లాంగ్ స్టాండింగ్‌లో పనిచేస్తున్న సీనియర్ సివిల్ సూపర్‌వైజర్లు 14 మందిని బదిలీ చేస్తూ సింగరేణి పర్సనల్ జీఎం ఉత్తర్వులు జారీ చేశారు. ఇం దులో ఆర్జీ-1 సివిల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇద్దరు ఉద్యోగులు ఉన్నా రు.

బదిలీ అయిన సూపర్‌వైజర్లు తమ స్థానాలకు వెళ్లి చార్జి తీసుకోగా.. ఆర్జీ ఇద్దరూ రిలీవ్ ఆర్డర్ తీసుకోకుం డా బదిలీలను రద్దు చేయించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. స్థానిక అధికారులతోపాటు కార్పొరేట్ స్థాయి వరకు పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చినట్టు కాంట్రాక్టర్లు బాహాటంగా చర్చించుకుంటున్నారు.

సివిల్ డిపార్ట్‌మెంట్‌లో ఇంత జరుగుతున్నా జీఎం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బదిలీ ఉత్తర్వులను అమలు చేయడంలో సివిల్ డిపార్ట్‌మెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.

గతం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగులను ఇక్కడే కొనసాగించేందుకు అధికారులు సహకరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోలేటి ఏరియా నుంచి ఆర్జీ  బదిలీ ఐన సూపర్‌వైజర్‌కుఆ ఏరియా నుంచి రిలీవ్ ఆర్డర్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది.

చర్యలు తీసుకుంటాం

ఆర్జీ-1 సివిల్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి ఆరోపణలు మా దృష్టికి కూడా వచ్చాయి. బదిలీ అయిన ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు అనారోగ్య కారణంతో.. మరొకరు కూతురి వివాహం ఉందని లెటర్ పెట్టుకున్నారు. అయితే వారిని మరో డిపార్ట్‌మెంట్‌కు మార్చేందుకు పరిశీలిస్తున్నాం. వారిపై పలు ఆరోపణ లు కూడా వస్తున్నాయి. విచారణ జరిపి వారంలో చర్యలు తీసుకుంటాం.

 కార్పొరేట్ సివిల్ జీఎం