calender_icon.png 13 January, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికత ఆధారంగా బదిలీలు!?

24-12-2024 12:00:00 AM

తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల వర్గీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీ.వో. స్థానికుల స్థానికతను ప్రశ్నార్థకంగా మార్చింది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాలలో ఉద్యోగ, ఉపాధ్యాయులను సీనియర్, జూనియర్ పేరిట విభజించారు. జూనియర్ ఉద్యోగులు పుట్టి పెరిగిన ప్రదేశాన్ని, చదివిన ప్రాంతాన్ని, కన్నవారిని, చివరకు కట్టుకున్న వారిని, తోబుట్టువులను అందరినీ వదిలి దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనడం సమంజసం కాదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నాలుగు నుండి పదో తరగతి వరకు ఏడేళ్లు ఎక్కడ చదివితే దానినే లోకల్‌గా పరిగణించి గతంలో ఉద్యోగాలకు, టీచర్ పోస్టులకు ఎంపిక చేసేవారు. కానీ, 317 జీ.వో. ప్రకారం ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరగలేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా జూనియర్ ఉద్యోగులు ప్రతి రోజు ఉద్యోగ రీత్యా వందలాది కి.మీ. దూరం ప్రయాణించవలసి వస్తున్నది.

శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు

1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేస్తే సమైక్యాంధ్ర, కేంద్ర ప్రభుత్వాలు ముల్కీ  నాన్‌ముల్కీ పేరున విభజించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశారు. ఎవరైతే స్థానికులో వారు ముల్కీ, స్థానికులు కానివారు నాన్‌ముల్కీ కిందికి వచ్చారు. దీనివల్ల తెలంగాణ వారికి తీరని అన్యాయం జరిగింది. విద్య, ఉద్యోగాల్లో 80 శాతం లోకల్, 20 శాతం నాన్‌లోకల్ కింద రిజర్వేషన్లు అమలు చేశారు.

పై జీవోవల్ల మహిళా ఉద్యోగుల అవస్థలు ఇన్నీ అన్నీ కావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని శాసనమండలిలో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు.శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న, కోదండరాం, ఏవీఎన్ రెడ్డి, కవిత ప్రభృతులు 317 జీ.వో. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించారు. అందరితో చర్చించి, శాశ్వత పరిష్కారం కనుగొనగలమని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. 

ఉద్యోగ, ఉపాధ్యాయులు తెలంగాణ ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టునుకూడా ఆశ్రయించారు. ‘బాధితుల సమస్యను మానవతా దృష్టితో చూడాలని, త్వరగా పరిష్కారించాలని’ న్యాయస్థానమూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల కేటాయింపు సీనియర్, జూనియర్ ప్రాతిపదికన కాక స్థానికత ఆధారంగా జరగాలని వారు కోరుతున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా వారు ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు. సమస్యలను లోతుగా తెలుసుకోవటానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదరం రాజనరసింహ, శ్రీధర్‌బాబు, సీతక్కలతో ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది. కాగా, ప్రభుత్వం త్వరలో ఈ జీ.వో. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్థానికత ఆధారంగా బదిలీలు జరపనున్నట్లు వార్తలు వచ్చాయి.

దీంతో ఎంతో ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. స్పౌజ్‌లు, వికలాంగుల బదిలీల కోసం త్వరలో ఉత్తర్వులు జారీ అవుతున్నట్లు కూడా తెలుస్తున్నది. పరస్పర బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అనేకమంది పరస్పర బదిలీల కోసం దరఖాస్తు చేసుకొని ఉత్తర్వులకోసం ఎదురు చూస్తున్నారు. కొత్త సంవత్సరంలో అయినా రేవంత్ సర్కార్ బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీపి కబురు అందించాలని వారు కోరుతున్నారు.

 డా. ఎస్. విజయభాస్కర్