22 డిపోలు, బస్టాండ్ల ఆస్తులను లీజుకు ఇచ్చేందుకు యత్నం.
పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ రూట్లలో ఎలక్ట్రికల్, డీలక్స్ బస్సులు రీప్లేస్
ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.
కారుణ్య నియామకాలే తప్ప నూతన నియామకాలేవీ?
ప్రభుత్వ ఆధీనంలో కాంప్లెక్స్ లు కట్టి ఎంప్లాయిస్ ను నియమించాలి
సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి...
కరీంనగర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ ఆస్తులైన డిపోలు, బస్టాండ్ల స్థలాలను ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు లీజుకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి దుయ్యబట్టారు. సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం జరిగింది. విలేఖరులనుద్దేశించి వెంకటస్వామి మాట్లాడుతూ... గతంలో పరిపాలించిన కాంగ్రెస్, తెలంగాణ ఆవిర్బావం తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వాలు మూడు విడతలుగా ఆర్టీసీ సంస్థ భూములను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడం జరిగిందని, నాలుగో విడతగా ప్రస్తుత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 22 డిపోలను, బస్టాండ్లను, ఖాళీస్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ప్రతిపాదనలు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. 22 బస్సు డిపోలకు చెందిన బస్టేషన్, వర్క్ షాపు, స్టాఫ్ క్వార్టర్లు, ఖాళీ స్థలాలకు సంబంధించి 66.3 ఎకరాల స్థలాన్ని ప్రైవేటుకు అప్పగించాలని చూడడం తగదు. ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థ ఆద్వర్యంలో కాంప్లెక్స్ లు కట్టి తదనుగుణంగా నూతన నియామకాలు చేసి సంస్థ ఆస్తులను కాపాడి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సంధర్బంగా ఆయన మాటల్లోనే.... ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థలో 58 వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఉంటే అది నేటికీ 42 వేలకు పడిపోయిందని, 10 వేల 500 బస్సులు ఉంటే అవి కూడా 9 వేలకు వచ్చాయని, అందులో కూడా ఇంకా కొన్ని చెడిపోయిన బస్సులు ఉన్నాయి. సంస్థలో కారుణ్య నియామకాలు తప్ప నూతన రిక్రూట్మెంట్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసి ఆర్టీసీ సంస్థకు అప్పగించేందుకు ప్రైవేటు సంస్థలైన మెగాకు 500 బస్, జేబీఎం కు 500 బస్ లను తయారుచేసి ఇవ్వాలని ఒప్పందం చేసుకోగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పై రెండు సంస్థల నుండి గత నెల క్రితం ఆ బస్సులను ఆర్టీసీ సంస్థకు మెగా, జేబీఎం సంస్థలు అప్పగించాయి. రాష్ట్రవ్యాప్తంగా 344 ఎలక్ట్రిక్ బస్సులు అన్ని డిపోల్లోకి ఆర్టీసీ సంస్థ కేటాయించింది. హైదరాబాద్ వన్ డిపోకు 50, వరంగల్ 2డిపోకు 73, కరీంనగర్ టు డిపోకు 71, నిజామాబాద్ టు డిపోకు 50, హైదరాబాద్ కంటోన్మెంట్‌కు వంద కేటాయించింది.
ఈ కేటాయించిన డిపోలలో ఉన్న బస్సులను ఉద్యోగస్తులను ఇతర డిపోలకు బదిలీ చేసి ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించి డిపోలను ప్రైవేట్ సంస్థ ఆధీనంలోకి కేటాయించింది. ఎలక్ట్రికల్ బస్సుల విస్తరణ మూలంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే మహాలక్ష్మి పథకానికి మంగళం పాడే చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుంది. ఎలక్ట్రిక్ బస్సులైన సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులలో మహాలక్ష్మి పథకం వర్తించదు. ప్రైవేట్ సంస్థల్లోని డిపోలకు కేవలం సూపర్ లగ్జరీ, డీలక్స్ ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే రాగా అందులో కండక్టర్ ఉండరు, మహాలక్ష్మి పథకం వర్తించదు. పల్లె వెలుగు బస్సులు నడిచే రూట్లలో ఎలక్ట్రిక్, డీలక్స్ బస్సులు నడుపుతున్నారు. ఎక్స్ ప్రెస్ బస్సులు నడిచే రూట్లలో కూడా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతున్నారు. అనేక రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. గతంలో కరీంనగర్-సిరిసిల్ల రూట్లలో ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సులు నడిచేవి ఇప్పుడు డీలక్స్, ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. కరీంనగర్ నుండి కామారెడ్డి రూట్ లలో, కరీంనగర్- గోదావరిఖని, కరీంనగర్ - లక్సెట్ పేట్ - మంచిర్యాల పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ ప్రెస్ బస్ లు నడిచేవి ఇప్పుడు ప్రైవేట్ హెయిర్ విత్ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు.
పల్లె వెలుగులు అత్యధికంగా కరీంనగర్ టు డిపో, వరంగల్ టు డిపోల్లో ఉన్నాయి. అలాగే నిజామాబాద్ టు డిపోలో ఎక్స్ ప్రెస్ బస్సులు ఉన్నాయి. పై డిపోలలో ఉన్న డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను ప్రక్కన పెట్టి ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. ఎక్స్ ప్రెస్ లు నడిచే చాలా రూట్లలో ఎలక్రికల్ బస్సులు రీప్లేస్ చేశారు. నిజామామాద్ –వరంగల్, కరీంనగర్ –కామారెడ్డి, వరంగల్-ములుగు –కాళేశ్వరం, వరంగల్ – ఖమ్మం, వరంగల్ –జెబిఎస్, కరీంనగర్ –జెబిఎస్, నిజామాబాద్ –జెబిఎస్ లలో ఎక్కువగా ఎక్స్ ప్రెస్ లు నడిచేవని ఇప్పుడు డీలక్స్ ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతున్నారు. పైలట్ ప్రాజెక్టు లుగా ఎంపిక చేసిన డిపోలలో కరీంనగర్ టు డిపో కూడా ఉంది. అందులో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం కరీంనగర్ టు డిపోను జేబీఎం సంస్థకు కేటాయించింది. ఇలా అనేక డిపోలలో ఉన్న పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను ఇతర డిపోలకు తరలించి వాటిని డిపోలలో పార్కింగ్ చేసి వృధాగా ఉంచుతున్నారు. వాటి నిర్వహణ జేబీఎం అనే సంస్థ నిర్వహిస్తోంది.
ఇంకా 660 ఎలక్ట్రికల్ బస్సులు రావాల్సి ఉండగా వాటిని ఇదే పద్దతిలో కేటాయించి ఆర్టీసిని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రమాదం ఉంది. అనేక డిపోలలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను ఇతర డిపోలకు తరలించారు. అలాగే స్టాఫ్ ను కూడా ట్రాన్స్ ఫర్ చేశారు. సంస్థలో పనిచేస్తున్న కార్మికులు తమ దోపిడీకి గురవుతున్నారని, పని భారం ఎక్కువై అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆర్టీసీ డిపోల వద్ద పనిచేస్తున్న కూలీలను కార్గో సర్వీస్ ల్లో ఎగుమతి, దిగుమతి కోసం తీసుకున్న తర్వాతనే మిగతా వారిని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అందుకు విరుద్ధంగా ఆర్టీసీ సంస్థ ఉన్నది. అనేక సంవత్సరాలుగా డిపోల వద్ద కూలీలుగా పనిచేస్తున్న వారిని విస్మరించడం సరైంది కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,3 వేల కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు తప్ప నూతన ఉద్యోగాలు కొనసాగలేదు. నూతన ఉద్యోగ నియామకాలు లేక ఉన్న ఉద్యోగులు 12 నుంచి 14 గంటల పనిభారంతో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నూతనంగా ఉద్యోగాల కోసం ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని వెంకటస్వామి అన్నారు. విలేఖరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయినీ అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బామండ్ల పెల్లి యుగేందర్, బోనగిరి మహేందర్, న్యాలపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.