calender_icon.png 21 February, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ తహసీల్దార్‌పై బదిలీ వేటు

19-02-2025 12:32:37 AM

క్రమశిక్షణ చర్యలు తీసుకున్న కలెక్టర్

మేడ్చల్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మేడ్చల్ తహసీల్దార్ బీ శైలజపై బదిలీవేటు పడింది. మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామం శివారులో రూ.100 కోట్ల విలువైన భూదాన్ భూమిని పట్టా భూమిగా మార్చేందుకు తహసీల్దార్ ప్రయత్నిస్తున్నారని విజయక్రాంతి దినపత్రికలో కథనం ప్రచురితమైంది.

5.04 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని తహసీల్దార్ శైలజ సిఫారసు చేసిన ఫైల్‌ను కలెక్టర్ గౌతం అనుమానంతో హోల్డులో పెట్టారు. ఈ భూమిపై అంతర్గత విచారణ చేయించగా భూదాన్ భూమిగా తేలింది. మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తికి ముగ్గురు కుమారులు.

అతని భూమి ముగ్గురికి సమానంగా పంచాల్సి ఉండగా ఇద్దరు పేరిట తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయమై విజయక్రాంతి దినపత్రికలో కథనం రావడంతో విచారణ చేయాలని ఉన్నతాధికారులు కలెక్టర్‌ను ఆదేశించారు. జూలై 27వ తేదీన కీసర ఆర్డీవో కార్యాలయంలో విచారణ జరిగింది.

రాజ బొల్లారం గ్రామ రెవెన్యూ పరిధిలో 207 సర్వే నెంబర్ లో ఉన్న పట్టా భూమి పట్టాదారుకు కాకుండా మరొకరికి కన్వర్షన్ చేశారు. దీనిపై విచారణ చేయాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్‌ను ఆదేశించారు. శైలజ ఇలాంటి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వీటిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

విజయక్రాంతి దినపత్రికలో కథనాలు రాగానే సెలవుపై వెళ్లి చాలా రోజుల తర్వాత తహసీల్దార్ తిరిగి విధులకు హాజరయ్యారు. ఆ సమయంలోనే ఆమె బదిలీకి ప్రయత్నించారు. ఆమెపై ఆరోపణలు ఉన్నందున బదిలీకి ఉన్నతా  అనుమతించలేదు.

సుదీర్ఘ విచారణ తర్వాత ఆమెపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాకు బదిలీ చేస్తున్నట్టు సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.