calender_icon.png 2 November, 2024 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మియాపూర్‌లో కాలిన ట్రాన్స్‌కో 220 కేవీ కేబుల్

12-05-2024 07:32:50 PM

పోలీస్ విచారణకు ఆదేశించిన సీఎండీ రిజ్వీ

హైదరాబాద్: మియాపూర్‌లోని ట్రాన్స్‌కో సబ్ స్టేషన్ 220 కేవీ కేబుల్ ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో కాలిపోయింది. దీంతో మియాపూర్, కైతలాపూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో కొంత సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది ప్రత్యామ్నాయంగా సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ఎస్‌ఏఎం రిజ్వీ, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

ఘటనపై విచారణ జరపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అయితే, నగరంలో అత్యధికంగా 4,350 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే సమయంలోనూ ఎలాంటి ప్రమాదానికి గురవ్వని కేబుళ్లు.. అతి తక్కువ డిమాండ్ ఉండే ఉదయం సమయంలో కాలిపోవడంపై విద్యుత్ శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, కేబుల్ కాలిపోవడంపై టీఎస్ ఎస్‌పీడీసీఎల్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించింది. విద్యుత్ సంస్థల ఎదుగుదలను ఓర్వలేక, సంస్థను ఇబ్బందులకు గురి చేయాలని కొందరు దుర్మార్గులు కుట్రలు చేస్తున్నారంటూ పోస్ట్ చేసింది. సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్టుగా ఎక్స్ వేదికగా ఎస్‌పీడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో చీఫ్ ఇంజినీర్ వివేకానందను వివరణ కోరగా.. సాంకేతిక కారణాలతో 220 కేవీ కేబుల్ కాలినట్టుగా చెప్పారు.