28-03-2025 12:36:50 AM
కుత్బుల్లాపూర్,మార్చ్ 27(విజయ క్రాంతి):కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్ కో ఏఈ ఎస్. సురేందర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు దొరికాడు. ఈయన దొమ్మరపోచంపల్లి సబ్ డివిజన్ లో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు.
దొమ్మరపోచంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని భౌరంపేట్ కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించి 11కెవి లైన్ సిఫ్టింగ్ ఎస్టీమేషన్ వేసేందుకు 30 వేలు లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.బాధితుని ఫిర్యాదు మేరకు గురువారం అవినీతి నిరోధక శాఖ సిటీ రేంజ్ యూనిట్-2 డిఎస్పీ పి.శ్రీధర్ నేతృత్వంలో డి.పోచంపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు.
బాధితుని దగ్గర నుండి 30 వేలు లంచం తీసుకొని కుడి చేతి ద్వార ప్యాంట్ జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఏఈ సురేందర్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా దొమ్మరపోచంపల్లి సబ్ డివిజన్ లో విధులు నిర్వహిస్తూ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.
అతన్ని అరెస్ట్ చేసిన అధికారులు విచారణ నిమిత్తం నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు.ఫిర్యాదుదారు పేరు, వివరాలు రహస్యంగా ఉంచబడతాయని తెలిపారు.