calender_icon.png 9 October, 2024 | 7:59 AM

తొక్కి సలాట జరగలేదు!

08-10-2024 01:31:53 AM

  1. అధిక వేడి, అధిక రద్దీ ఉండటమే కారణం
  2. చెన్నై ఎయిర్‌షో విషాదంపై తమిళనాడు ప్రభుత్వం వివరణ

చెన్నై, అక్టోబర్ 7: తమిళనాడు రాజధాని చెన్నై మెరీనా బీచ్‌లో ఆదివారం జరిగిన ఎయిర్‌షోలో ఐదుగురు మృతి చెందిన ప్రమాదం విషయంలో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. సర్కారు నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది.

తొక్కిసలాట, నిర్వహణలో పం వల్ల ఈ పరిస్థితి తలెత్తలేదని తెలిపింది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన చాలామంది కోలుకున్నారని డీఎంకే నేత అన్నాదురై వెల్లడించారు. వైమానిక విన్యాసాలపై భారీగా ప్రచారం చేయడంతో చెన్నై బీచ్‌కు 15 లక్షల మంది జనం పోటెత్తారు. దీంతో తీరం వెంబడి 15 కి.మీ. మేర సందర్శకులు గుమిగూడారు.

దీంతో బీచ్ రోడ్‌లో ఎండ తీవ్రతతో పాటు నీటి వసతి కూడా లేకపోవడంతో బాధితుల సంఖ్య పెరిగింది. దీనిపై అన్నాడీఎంకే, బీజేపీ తీవ్ర  విమర్శలు చేశాయి. లక్షల మంది జనాలు హాజరైనప్పుడు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని మాజీ సీఎం పళనిస్వామి ఆరోపించారు.

సీఎం స్టాలిన్ సహా కీలక నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కార్యక్రమాన్ని సక్రమంగానే నిర్వహించామని, ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రదర్శన జరుగుతున్న సమయంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయని, రద్దీ కూడా ఎక్కువగా ఉందని డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు.