calender_icon.png 14 October, 2024 | 12:53 PM

481 రైళ్లు.. 550 బస్సులు రద్దు

03-09-2024 01:25:33 AM

  1. 68 రోడ్లు ధ్వంసం, 386 చోట్ల అవాంతరాలు
  2. యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న పనులు

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వల్ల రోడ్డు, రైలు మార్గాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా 481 రైళ్లను రద్దు చేశారు. 152 రైళ్లను దారిమళ్లించారు. 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 27 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. రెండు రైళ్లను పాక్షికంగా మళ్లించారు. కాగా... వర్షాల వల్ల దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 68 రోడ్లు దెబ్బతిన్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.

సుమారు 300 చోట్ల రోడ్లపైకి వరద వచ్చిందని, 386 చోట్ల వర్షాల ప్రభావం వల్ల రాకపోకలకు ఆటంకాలు ఎదురైనట్లు తెలిపారు. రూ. 5.67 కోట్లతో యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను శాశ్వతంగా పునరుద్ధరిం చేందుకు రూ. 2,362 కోట్లు ఖర్చు అవ్వనున్నట్లుగా అధికారులు అంచనా వేశారు. 

కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులు

ఇంటికన్నె  కేసముద్రం సెక్షన్ ట్రాక్ పునరుద్ధరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సోమవారం పరిశీలించారు. రైలు కార్యకలాపాలలో సరైన భద్రతను నిర్ధారించడానికి ప్రామాణిక భద్రతా నిబంధనలకు అనుగుణంగా పునరుద్ధరణ పనులను చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైళ్లను నడపడానికి వీలైనంత త్వరగా ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేయాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. అన్ని భద్రతా ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన నీటి మళ్లింపుకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని ఆయన వారికి సూచించారు.

ఈ పనులు పూర్తయ్యే వరకు ఈ మార్గంలోని పలు రైళ్లను రద్దు చేయడం, దారిమళ్లించడం చేసినట్లు వెళ్లడించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పి. డి మిశ్రా దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ పీ ఎస్ బ్రహ్మానందం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వుజర్ ఎస్ వివేకానంద్ సికింద్రాబాద్ డివిజన్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు.

ప్రత్యమ్నాయ రవాణా సౌకర్యాలతో గమ్యస్థానాలకు 10వేల మంది..

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల ప్రభావంతో 5 రైళ్లు మార్గమధ్యలో నిలిచిపో యాయని ఇందులో ఉన్న 10వేల మంది ప్రయాణికులను ప్రత్యమ్నాయ ఏర్పాట్ల ద్వారా గమ్యస్థానాలకు చేర్చినట్లు ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ చెన్నై తమిళనాడు ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ తాంబరం చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ట్రాక్‌పైకి భారీగా వర్షపు నీరు చేరడంతో కొండ పల్లి, రాయనపాడు స్టేషన్ల వద్ద నిలిచిపోయాయి.

ఇక్కడి నుంచి జేసీబీల సాయంతో ప్రయాణికులు రైలు నుంచి బయటకు దిగేలా ఏర్పాట్లు చేసి 4200 మందిని 84 బస్సుల్లో విజయవాడకు తరలించారు. వీరి కోసం విజయవాడ నుంచి విశాఖ, చెన్నై వైపునకు మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు చేర్చారు. బెంగళూరు దానాపూర్, దానాపూర్ బెంగళూరు సంఘమిత్ర రైళ్ల ప్రయాణికుల కోసం 74 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి నెక్కొండ నుంచి కాజీపేటకు తరలించారు. కాజీపేట నుంచి ప్రత్యేకంగా 2 రైళ్లను ఏర్పాటు చేసి 5600 మందిని దానాపూర్, బెంగళూరు మర్గాల్లో గమ్యస్థానాలకు చేర్చారు.

దీపావళి సందర్భంగా కరీంనగర్- ముంబయి మధ్య ప్రత్యేక రైళ్లు

దీపావళి సందర్భంగా కరీంనగర్- సీఎస్‌టి ముంబయి మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 29, నవంబర్ 5వ తేదీల్లో ముంబయి నుంచి రైలు (నెం. 01067) బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో కరీంనగర్‌లో అక్టోబర్ 30, నవంబర్ 6వ తేదీల్లో కరీంనగర్ నుంచి రైలు నెం.01068 ముంబయి తిరుగుప్రయాణం అవుతాయి. ఈ రైళ్లు దాదర్, థానే, కల్యాణ్, నాసిక్ రోడ్, మన్మాడ్, నాగర్‌సోల్, ఔరంగాబాద్, జాల్నా, పర్భణి, పూర్ణా, నాందేడ్, ముద్కేడ్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, ఆర్మూర్, మెట్‌పల్లి, కోరుట్లలో ఆగుతాయి.