calender_icon.png 19 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికులను తికమక పెడుతున్న రైళ్లు!

19-04-2025 12:11:26 AM

  1. ప్రయాణికులను తికమక పెడుతున్న రైళ్లు!
  2. కేసముద్రంలో ఒక వైపు స్టాప్..మరోవైపు నో స్టాప్..!!

మహబూబాబాద్, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): కాజీపేట - విజయవాడ రైల్వే మార్గంలో కేసముద్రం రైల్వేస్టేషన్లో మూడు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఒకవైపే ఆగుతూ, మరోవైపు ఆగకుండా వెళ్ళిపోతుండడంతో ప్రయాణికులు తికమక పడుతున్నారు. సాయి నగర్ షిరిడి నుండి మచిలీపట్నం (17207), సాయి నగర్ షిరిడి నుండి కాకినాడ (17205) , సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే (12764) పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల కు కేసముద్రంలో హాల్టింగ్ కల్పించారు.

అయితే కాకినాడ నుండి సాయి నగర్ షిరిడి (17206), మచిలీపట్నం నుండి సాయి నగర్ షిరిడి (17208), తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12763)  రైళ్లకు కేసముద్రంలో హాల్టింగ్ తొలగించారు. ఈ మూడు రైళ్లు డౌన్ మార్గంలో వెళ్లే సమయంలో కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఆగుతుండగా, సికింద్రాబాద్ వైపు వెళ్లే సమయంలో ఆగడం లేదు.

ఒక వైపు హాల్టింగ్ కల్పించి, మరోవైపు హాల్టింగ్ కల్పించకుండా రైల్వే శాఖ ప్రయాణికులను తికమక పెడుతోంది. తిరుపతి వెళ్లే భక్తులకు పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు కేసముద్రంలో హాల్టింగ్ కల్పించడంతో భక్తులకు ఎంతో అణువుగా ఉంది. అయితే సికింద్రాబాద్ వైపు వెళ్లే సమయంలో హాల్టింగ్ తొలగించడంతో తిరుపతికి వెళ్లి తిరుగుముఖం పట్టిన భక్తులు మహబూబాబాద్ లేదంటే వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కేసముద్రం చేసుకోవాల్సి వస్తోంది.

ఇక ఇదే తరహా సాయి నగర్ షిరిడి వెళ్లే సమయంలో రైళ్లకు హాల్టింగ్ కేసముద్రంలో తొలగించగా, సాయి నగర్ షిరిడి నుండి విజయవాడ వైపు వెళ్లే సమయంలో రెండు రైళ్లకు హాల్టింగ్ కల్పించారు. సాయి నగర్ షిరిడి వెళ్లే భక్తులు మహబూబాబాద్, వరంగల్ రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడ నుండి ఆ రైళ్ల ద్వారా సాయి నగర్ షిరిడి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రైళ్లు కూడా కేసముద్రం స్టేషన్ ద్వారానే ప్రయాణిస్తున్నప్పటికీ ఒక మార్గంలో హాల్టింగ్ కల్పించి, మరో మార్గంలో హాల్టింగ్ తొలగించడం రైల్వే శాఖ విచిత్ర తీరుకు నిదర్శనంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ఒకవైపు రైళ్లకు హాల్టింగ్ కల్పించి, మరోవైపు హాల్టింగ్ తొలగించడం ఎక్కడ చూడలేదని, కేసముద్రం రైల్వే స్టేషన్ లోనే వింత పరిస్థితి ఎదురవుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తిరుపతి, షిరిడి పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగి రావడానికి రైళ్లకు ఒకవైపే హాల్టింగ్ కల్పించడం వల్ల అసౌకర్యంగా మారిందని భక్తులు ఆరోపిస్తున్నారు. 

కొంతకాలం పాటు రెండు మార్గాల్లో రైళ్లకు హాల్టింగ్ కల్పించి ఆదాయం రావడంలేదని సాకుతో ఒకవైపు మాత్రమే హాల్టింగ్ ఉంచి, మరోవైపు తొలగించడం సరైన పద్ధతి కాదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. రెండు వైపులా మూడు రైళ్లకు కేసముద్రంలో హాల్టింగ్ కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

రెండు వైపులా రైల్లు ఆపాలి.

కేసముద్రం రైల్వే స్టేషన్ లో పద్మావతి, సాయి నగర్ షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లకు రెండు వైపులా హాల్టింగ్ కల్పించి, కొద్దిరోజులకు ఒకవైపు తొలగించారు. దీనివల్ల తిరుపతి, షిరిడి వెళ్లి రావడానికి కేసముద్రం ప్రాంత భక్తులకు అసౌకర్యంగా మారింది. కేసముద్రం ఇటీవలే మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయ్యింది. పట్టణంగా మారిన కేసముద్రం రైల్వే స్టేషన్లో ఆ రైళ్లకు ఇరువైపులా హాల్టింగ్ ఇచ్చి, మరికొన్ని కొత్త రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలి. 

 బండారు దయాకర్, ఉప్పరపల్లి