08-04-2025 08:21:53 PM
ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి..
ప్రజల ఆరోగ్యం కాపాడటానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి..
జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో ఆహార భద్రత, ఆరోగ్యకరమైన ఆహారాలపై జిల్లా స్థాయి సలహా కమిటీ (DLAC) కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ... జిల్లాలోని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు నాణ్యమైన ఆహారం ప్రజలకు అందించడానికి అవసరమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
హోటల్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు వాడిన నూనెను బయో డీజిల్ సంస్థలకు అమ్మకం చేపట్టే విధంగా జిల్లా ఇండస్ట్రీ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల శ్రేయస్సు కోసం వ్యాపారస్తులు ఆహార భద్రత యొక్క ప్రమాణాలను పాటించాలని కలెక్టర్ తెలిపారు. మార్కెట్లో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం లభ్యత కొరకు నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అనారోగ్యకరమైన గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను, ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని వాటి అమ్మకాలను పర్యవేక్షించడం, వాటిని నివారించడానికి నిరంతర సోదాలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో బేకరీ వస్తువులు, పాలు వంటనూనె, చికెన్, మాంసం నిల్వలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, చాట్ బండి, పౌల్ట్రీ, ఇతర రోజు వారి వినియోగ వస్తువులు నాణ్యతను పర్యవేక్షిస్తూ నాణ్యమైన వాటినే విక్రయించేలా వ్యాపారస్తులకు శిక్షణ తరగతులు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి, వాటి వివరాలను అందజేయాలని, ఫుట్ పాయిజన్ కు కారణాలు నిర్ధారించాలని ఆదేశించారు. FOSTAC కి సంబంధించి, ఆహార భద్రత, ధ్రువీకరణ వ్యవస్థ కింద ఆహార వ్యాపారాలకు క్రమబద్ధమైన శిక్షణ నిర్వహించాలన్నారు.
మహిళ సమాఖ్య సభ్యులకు ఆహార భద్రతపై శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాల్లో వైద్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆహార పదార్థాల నిల్వ చేయు ప్రదేశాలు, వంటగది తనిఖీ చేసి ఏమైనా సమస్యలుంటే నివేదికలు అందించాలన్నారు పాఠశాలల్లో ఆహారం నిల్వలు ఉండే ప్రదేశంలో ఎలుకలు, పురుగులు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. 100 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాల పై ప్రత్యేక దృష్టి సారించాలని,పది రోజుల్లో జిల్లాలోని అన్ని పాఠశాలలు వసతి గృహాల్లో పర్యటించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు.
విద్యార్థులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి గాను అవసరమైన సోలార్ డ్రైవర్లు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని, దాని ద్వారా ఆహారం వృధా కాకుండా ఉండాలని దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అవసరానికి సరిపడ వరి సాగు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పౌరసరఫరాల అధికారులు జిల్లాలోని దుకాణాలలో పరిశుభ్రత పాటించాలన్నారు. రేషన్ కార్డు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు , గర్భిణీలకు మంచి పోషక ఆహారం అందించాలని అన్నారు. వేసవిలో ఐస్ వినియోగం అధికంగా ఉంటుందని, ఆ యొక్క ఐస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఐస్ తయారీకి ఉపయోగించే నీరు పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయాలన్నారు.
ఏప్రిల్, మే నెలలో ఆహార వ్యాపారులను కేటగిరి వారీగా ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాల వినియోగం, ఆహార పదార్థాల తయారీలో పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మంచిగా నాణ్యత ప్రమాణాలు పాటించే వ్యాపారస్తులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించిన వారికి జరిమానా, వ్యాపారాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, పరిశ్రమల శాఖ అధికారి పృథ్వి, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ మెంబర్లు శ్యాం కుమార్, సంపత్ కుమార్, ఆహార వ్యాపారస్తులు కృష్ణారెడ్డి, నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.