19-09-2024 12:59:01 AM
పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ నేతల మాటలకు కనీసం స్పందించే వారు దొరకడం లేదని, అందుకే తమ వారికే ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో బీఆర్‌ఎస్ లీడర్ల అసలు రంగు బయటపడిందన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఫొటోలు దిగే సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలను బుధవారం రామ్మోహన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘ఈ వీడియోలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఓ రైతును ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా నటించమని చెబుతున్నారు.
ఆయన రైతులను ఓదారుస్తున్నట్ల్లుగా ఫొటోలు దిగారు. దీని కోసం బీఆర్‌ఎస్ నాయకులు రైతును పొలంలో కూర్చోబెట్టి, బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా నటించమని చెబుతూ ట్రైనింగ్ ఇస్తున్నారు’ అని సామా తెలిపారు. ప్రజాపాలనలో బీఆర్‌ఎస్ నాయకులకు స్పందించేవాళ్ల లేక సొంత పార్టీ నేతలనే నటించాలని ట్రైనింగ్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ చర్యలపై బీఆర్‌ఎస్ నాయకులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.