calender_icon.png 25 October, 2024 | 9:45 AM

మైక్రో అబ్జర్వర్లు ఎన్నిలపై అవగాహన ఏర్పర్చుకోవాలి

05-05-2024 12:57:32 AM

ఎన్నికల పరిశీలకుడు గోపాల్ జీ తివారి

కామారెడ్డి, మే 4 (విజయక్రాంతి): మైక్రో అబ్జర్వర్లు ప్రతి అంశంపై అవగాహన ఏర్పర్చుకోవాలని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు గోపాల్ జీ తివారి తెలిపారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు పోలింగ్‌కు సంబంధించిన పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాక్ పోల్, తదనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియల నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలన్నారు. గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల ఈవీఎంలు పనిచేయకపోతే వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఎలా అమరుస్తున్నారు అన్నది పరిశీలన చేయాలన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు.

ఆరు గంటలలోపు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లు ఇంకా మిగిలి ఉంటే వారిని వరుస క్రమంలో నిలబెట్టి చివరి నుంచి ముందు వరుసలో ఉన్న ఓటర్ వరకు క్రమసంఖ్య చీటీలు అందించి పోలింగ్ జరిపించాల్సి ఉంటుందన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని వివరించారు. పోలింగ్ కేంద్రం బయట పరిసర ప్రాంతాల్లోను జరిగే అంశాలను గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘ ఉంచాలన్నారు. ఎన్నికల సంఘం గుర్తింపుకార్డులు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు మినహా ఇతరులు ఎవరికీ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. 18 అంశాలకు సంబంధించిన నివేదికను ఎప్పటికప్పుడు జనరల్ అబ్జర్వర్‌కు నేరుగా పంపాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్, నోడల్ అధికారులు వరదా రెడ్డి, రాజారం, రఘునాథరావు, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.