కారుకు సైరన్, ప్రభుత్వ స్టిక్కర్ వాడినందుకు చర్యలు
ఆమె తల్లిపైనా ఆయుధాల చట్టం కింద కేసు నమోదు
పుణె, జూలై 14: వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఉపయోగించిన ఆడి కారును పుణె ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆమె కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, నంబర్ ప్లేట్లను వాడటం, 21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కారు పత్రాలను సమర్పించాలని యజమాని పూజాను ఆదేశిస్తూ ట్రాఫిక్ పోలీసు విభాగం నోటీసులు జారీచేసింది. ఆమె కుటుంబ డ్రైవ ర్ చతుష్రింగి శనివారం రాత్రి పోలీస్ స్టేషన్ లో కారు తాళాలు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
కారు పత్రాలు సమర్పించలేదన్నారు. పూజా ఖేద్కర్ తల్లి మనోరమకు పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వారి ఇంటి బయట గోడకు నోటీసులు అంటించారు. తాజాగా, మనోరమ ఓ వ్యక్తిని తుపాకీ తో బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కొందరు గ్రామస్థులను ఆమె పిస్తోల్‌తో బెదిరిస్తున్నట్లు రికార్డుంది. దీనిపై స్థానిక రైతు ఫిర్యాదు చేయడంతో ఆయుధాల చట్టం కింద ఆమెపై కేసు నమోదైంది. ఇందులో భాగంగానే తన తుపాకీ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మనోరమా వెల్లడించాలని నోటీసులో పేర్కొన్నారు. 10 రోజుల్లోగా స్పందించాలని ఆదేశించారు.
యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు
పుణెలో బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడంతో పూజా వివాదాస్పదమయ్యారు. దీంతో ఆమెను ప్రభుత్వం వాసిమ్‌కు బదిలీ చేసింది. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండళ్ల పాటు ఉండే జూనియర్ అధికారులు కార్లకు సైరన్, ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లు పెట్టుకోరాదు. కానీ ఈ నిబంధనలు పాటించకుండా పూజా వ్యవహరించింది. మరోవైపు, ఆమె పూజా యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.