calender_icon.png 25 October, 2024 | 4:59 AM

అమరావతికి రైలు

25-10-2024 02:47:16 AM

ఏపీ రాజధానికి కొత్త మార్గం

రూ.2,245 కోట్ల తో నిర్మాణం

కేంద్ర క్యాబినెట్ ఆమోదం

బీహార్‌కూ కొత్త రైల్వే ప్రాజెక్టు

ఇన్‌స్పేస్ వెంచర్ ఫండ్‌కు వెయ్యికోట్లు

కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఎన్డీయే ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు మోదీ సర్కారు దీపావళి కానుకలు ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లో వేలకోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 

దేశంతో అమరావతి అనుసంధానం

ఏపీ కొత్త రాజధానిని ఇతర రాష్ట్రాల రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు ప్రతిపాదిత రైలు మార్గం తోడ్పడుతుందని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. రూ.2,245 కోట్ల వ్యయ ంతో 57 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను నిర్మిస్తారు. ఎర్రపాలెం నంబూరు మధ్య ఈ మార్గం ఉంటుంది. దీనిని నాలుగేండ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ మార్గం చారి త్రక అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తుంది. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాతో అమరావతిని కలుపుతుంది. ఈ లైన్‌లో భాగంగా కృష్ణానదిపై 3.2 కి.మీ. పొడవైన వంతెన నిర్మిస్తారు. ఇది తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని ఎన్టీఆర్, గుం టూరును కలుపుతుంది. ఈ ప్రాంతంలో కాలుష్య నివారణకు 25 లక్షల మొక్కలు నాటనున్నారు. రైల్వే లైన్‌తోపాటు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.252.42 కోట్లు కేటాయించింది.

బీహార్‌కు రైల్వే ప్రాజెక్టు

మరో మిత్రపక్షమైన బీహార్‌కు కూడా కేంద్ర క్యాబినెట్ తీపి కబురు అందించింది. ఆ రాష్ట్రంలో 256 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.4,553 కోట్లు. నర్కతియాగంజ్ సీతామడి కారిడార్ డబ్లింగ్ పనులు చేపడుతారు. ఈ ప్రాజెక్టుతో బీహార్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌కు కూడా ప్రయోజనం చేకూరుతుంది. 

ఇన్‌స్పేస్‌కు వెయ్యి కోట్లు

దేశంలో అంతరిక్ష రంగాన్ని బలోపేతం చేసేందుకు క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇన్ ఆధ్వర్యంలో రూ.1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుచేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ఫండ్ ద్వారా అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తారు. 

కేంద్రానికి చంద్రబాబు కృతజ్ఞతలు

అమరావతికి కొత్త రైల్వేలైన్ మంజూరు చేయటంపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ లైన్‌తో దేశంలోని ఇతర ప్రాంతాలతో అమరావతికి ఉత్తమ అనుసంధానం ఏర్పడుతుందని చెప్పారు. అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశంలో చంద్రబాబుతోపాటు ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రతిపాదనలు పంపిన పది రోజుల్లోనే రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలుపటంపై ప్రధానికి పవన్‌కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.