calender_icon.png 25 October, 2024 | 9:47 AM

నక్సల్ అడ్డాలో రైలు కూత

09-07-2024 02:21:41 AM

  • భద్రాచలం నుంచి మల్కన్‌గిరికి లైన్
  • ఒడిశా నుంచి నేరుగా హైదరాబాద్, ఢిల్లీ 
  • భద్రాచలానికి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ
  • కొత్తమార్గంతో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఊతం

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కన్‌గిరికి మహర్దశ పట్టనుంది. త్వరలో ఈ ప్రాంతంలో రైలు కూత పెట్టనుంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరికి రైలు మార్గం నిర్మించనున్నారు. తెలంగాణలో కొత్తగా నిర్మించనున్న 15 రైలు మార్గాల్లో భద్రాచలం మల్కన్‌గిరి లైన్ ఎంతో ప్రధానమైంది. ఇప్పటికే ఈ లైన్ కోసం సర్వే పూర్తుంది. తెలంగాణ, ఏపీ, ఒడిశాను కలపనుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి అటవీ ప్రాం తంలో ఉంటుంది.

అక్కడి నుంచి ఏపీలోని అల్లూరి జిల్లాలో ఉన్న చింతూరు మీదుగా భద్రాచలం వరకూ కొత్త రైల్వే లైనుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో ఈ లైన్ నిర్మాణం జరగనుంది. ఈ రైల్వే లైను పొడవు 186 కి.మీ. కాగా అంచనా వ్యయం రూ.3,592 కోట్లు. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండే ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం 213 వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. అందులో 48 భారీ వంతెనలు కూడా ఉన్నాయి. ఆదివాసీ ప్రాం తాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఈ మార్గం దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది. ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్) పూర్తి కాగా పరిశీలించిన రైల్వేబోర్డు తుది అనుమతులను ఇచ్చింది.  

వెనకబడిన ప్రాంతాలకు ప్రయోజనం...

ఈ లైన్ మూడు రాష్ట్రాల్లోని వెనకబడిన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. ప్రస్తుతం ఒడిశాలోని జైపూర్ నుంచి మల్కన్‌గిరి వరకు రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి భద్రాచలం వరకు కొత్తగా నిర్మించనున్న మార్గం వల్ల ఈ ప్రాంతానికి మరింత ప్రయోజనం కలుగనుంది. కొత్త లైన్ ఒడిశాలోని మల్కన్‌గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహారాజ్‌పల్లి, మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. కూనవరం, ఎటపాక మండలాల్లోని గ్రామా ల మీదుగా కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది.

ప్రస్తుతం భద్రాచలానికి సమీపంలో ఉండే రైల్వే స్టేషన్ పాండురంగాపురం వరకు ఈ రైల్వే లైన్ నిర్మిస్తారు. అంతేకాకుండా ఇప్పటికే నిర్ణయించిన మణుగూరు రామ గుండం రైల్వే లైన్‌కు ఈ మార్గాన్ని అనుసంధానించనున్నారు. ఈ తరుణంలో కాజీపేట, డోర్నకల్, కొత్తగూడెం, పాండురంగాపురం, మణుగూరు వరకు ఉన్న రైల్వే లైన్‌కు మల్కన్‌గిరి భద్రాచలం పాండురంగాపురం లైన్ కలుస్తుంది. ఫలితంగా ఒడిశా నుంచి హైదరాబాద్, రామగుండం, నాగ్‌పూర్ మీదుగా ఢిల్లీకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుంది. ఈ లైన్‌తో ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్ రైల్వే లైన్‌లకు సైతం అనుసంధానం లభించనుంది.