- మూడు ప్రాంతాల్లో భక్తుల మధ్య తొక్కిసలాట
- ఆరుగురు మృతి.. మృతుల్లో ఐదుగురు మహిళలే
- వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా పోటెత్తిన భక్తులు
- సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. నేడు తిరుపతికి..
తిరుపతి, జనవరి 8 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో పెను విషా దం సంభవించింది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తు లు తరలిరావడంతో బుధవారం సాయం త్రం తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు.
మరికొందరు అస్వస్థతకు గురికావడంతో స్థానిక రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుం ఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఈనేపథ్యంలో తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణ పురం బైరాగిపట్టెడ, రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలకు బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. టోకెన్ల కోసం వచ్చిన భక్తులు రోడ్లపై గుమికూడకుండా బైరాగిపట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో ఉంచారు.
అయితే టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరికి అస్వస్థత కావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు క్యూలైన్ తెరిచారు. దీంతో టోకెన్లు జారీ చేసేందుకు క్యూలైన్ తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగిందని అంచనా వేస్తున్నారు.
తొక్కిసలాటలో గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రుయా ఆస్పత్రిలో 20 మంది, స్విమ్స్‌లో 9 మందికి చికిత్స అందిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పలువురు భక్తులు ఆరోపించారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి పోలీస్ బలగాలు చేరుకుని భక్తుల రద్దీని నియంత్రించాయి.
వాస్తవానికి ఈనెల 10,11,12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు 1.20లక్షల టోకెన్లను గురువారం జారీ చేయాల్సి ఉంది. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల్లో ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది. అయితే భక్తుల రద్దీ కారణంగా బుధవారం రాత్రి నుంచే టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. దీంతో భక్తులు భారీగా తరలివచ్చారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన చెందారు. తిరుపతి ఘటనపై అధికారులతో రాత్రి ఆయన సమీక్షించారు.
బాధితులకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను అధికారులను అడిగి తెలుసుకు న్నారు. భక్తుల రద్దీ మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని ఆదేశించారు. మృతుల కుటుం బాలకు పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. గురువారం ఉదయం చంద్రబా బు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు.
భక్తుల మృతి బాధాకరం
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందడం చాలా బాధాకరమని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ
తిరుపతిలో తొక్కిసలాట బాధాకరం..
తిరుపతిలో తొక్కిసలాట బాధాకరమని లోక్ సభ ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
తీవ్ర ఆవేదనకు లోనయ్యా..
తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు లోనుచేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాల కు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నానన్నా రు.
డిప్యూటీ సీఎం పవన్
మృతుల కుటుంబాలకు రేవంత్ సానుభూతి..
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృ తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్ర కటించారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
డీఎస్పీ గేటు తెరవడం వల్లే..
తిరుపతిలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని, పండుగ సమయంలో ఇలా కావడం బాధాకరమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఒక సెం టర్‌లో డీఎస్పీ గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగినట్లు చెప్పారు. ఆరుగురు మృతు ల్లో ఒకరిని మాత్రమే గుర్తించామన్నారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు