30-04-2025 12:49:28 AM
ఖమ్మం, ఏప్రిల్ 29 (విజయక్రాంతి):-ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని పాత మిట్టపల్లి గ్రామంలో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీకై ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలతో అస్పత్రి లో ప్రాణాపాయంతో కొట్టు మిట్టాడుతున్నారు. గ్రామస్తులు కథనం ప్రకారం పాత మిట్టపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ వినోద్ కుమార్ అనే వ్యక్తి తన నివాస గృహంలో రాత్రి వంటగ్యాస్ అయిపోవడంతో కొత్త సిలిండర్కు రెగ్యులేటర్ ను సక్రమంగా అమరకపోవడంతో గ్యాస్ లీకైంది.
ఈ విషయాన్ని గమనించకపోవడంతో గ్యాస్ పరిసర ప్రాంతంలో వ్యాపించింది.అక్కడే వాటర్ హీటర్ నడుస్తుండటం,కట్టెల పోయి వెలుగుతుండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగంతా ఇంటిలో అలుముకుంది.అదే సమయంలో ఇంటిలో వినోద్ కుమార్ తో పాటు అతని పిల్లలు తరుణ్, వరుణ్, వినోద్ చెల్లెలు పిల్లలు ప్రిన్సీ,లింసీ, వినోద్ నాయనమ్మ సుశీల ఇంట్లోనే ఉండటంతో మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే గమనించిన స్థానికులు, హమాలీలు గోనెబస్తాలతో మంటలను అదుపుచేసి గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తరుణ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చగా చికిత్స పొందుతూ తరుణ్ (8) మృతి చెందగా, ఖమ్మం లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ వినోద్ నాయనమ్మ సుశీల (70) కూడా మరణించింది.కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
ఎమ్మెల్యే రాగమయి పరామర్శ
ఖమ్మం ప్రభుత్వ అస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా చూడాలని ఎమ్మెల్యే వైద్యులను కోరారు. ఎమ్మెల్యే వెంట కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.