ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట 30 మంది మృతి
మౌని అమావాస్య రోజు కుంభమేళాకు కోట్ల మంది భక్తులు
- రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ విచారం
- ఘటనపై త్రిసభ్య కమిషన్
- 30 మంది మృతి చెందారని ప్రకటించిన మహాకుంభ్ డీఐజీ
- చెల్లాచెదురుగా పడిపోయిన బ్యాగులు
- పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: సీఎం యోగి
- బారికేడ్ల మీద నుంచి దూకిన భక్తులు
- చెత్తడబ్బాలే కారణమంటూ ప్రత్యక్ష సాక్షుల వెల్లడి
- భక్తుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు
- 25 మంది మృతుల గుర్తింపు
* ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో మహావిషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మంది గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట నుంచి 2 గంటల మధ్య.. త్రివేణి సంగమం ప్రదేశంలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది.
చీకట్లో భక్తుల కాళ్లకు ఇనుప చెత్తబుట్టలు తగలడం, బారికేడ్ల పైనుంచి దుంకి స్నానాలకు వెళ్లేందుకు ఆతృత పడడం వల్ల తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.
ప్రస్తుతం మహాకుంభ్ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేసింది. బుధవారం ఒక్కరోజే కుంభమేళాలో 5 కోట్ల 71 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అమృతస్నానం చేసేందుకు నలుగురు శంకరాచార్యులు కదలివచ్చారు.
ప్రయాగ్‌రాజ్, జనవరి 29: కుంభమేళాలో మహావిషాదం చోటు చేసుకుంది. మౌని అమవాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మంది భక్తులు మృతి చెందినట్లు మహాకుంభ్ డీఐజీ వైభవ్‌కృష్ణ తెలిపారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ తొక్కిసలాటలో 60 మంది వరకు భక్తులు గాయపడ్డారు.
అయితే ప్రభుత్వం మాత్రం గాయపడిన వారి సంఖ్య 36గా తెలిపింది. త్రివేణి సంగమంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను అర్ధరాత్రి సమయంలో దూకేందుకు కొంత మంది భక్తులు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తెలిపారు. ఈ ఘటనపై దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
కారణాలను గురించి తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కమిషన్ వేస్తున్నట్లు సీఎం యోగి తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇదొక్కటే కాదు..
* 1954లో కుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజు తొక్కిసలాట జరగ్గా.. ఆనాటి విషాద ఘటనలో 800 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నాడు ఒక ఏనుగు వల్ల ఘటన చోటు చేసుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
* 2003లో కుంభమేళా సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 39 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
* ఇక 2013లో జరిగిన కుంభమేళాలో అ లహాబాద్‌లో జరిగిన ఓ తొక్కిసలాట ఘ టనలో 42 మంది మరణించారు.
అవే కారణాలు..
కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కొంత మంది ప్రత్యక్ష సాక్షులు ఘటనకు గల కారణాలను వివరించారు. ‘తెల్లవారు జామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తలపై పెద్ద, పెద్ద లగేజీ బ్యాగులతో భక్తులు వచ్చారు. ఎటు వెళ్లాలి. ఎక్కడ స్నానం చేయాలనే విషయం గురించి ఎవరికీ సరైన అవగాహన లేదు.
యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప చెత్తడబ్బాలు తగిలి చాలా మంది కింద పడిపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది’అని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అలాగే బారికేడ్లు దూకడం వల్ల కూడా తొక్కిసలాట జరిగిందని కొంత మంది తెలిపారు.
బ్యాగుల కుప్పలు..
తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో బ్యాగులు, భక్తుల దుస్తులు, పాదరక్షలు కుప్పలుగా పడి కనిపించాయి.
న్యాయ విచారణకు ఆదేశం
‘కుంభమేళా తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో కూడిన జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. ఈ కమిషన్‌కు జస్టిస్ హర్ష్ కుమార్ అధ్యక్షత వహించనున్నారు’. అని యూపీ సీఎం యోగి తెలిపారు.
తొక్కిసలాట బాధాకరం
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి
తీవ్ర విచారకరం
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన విచారకరం. తొక్కిసలాటలో ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
నరేంద్ర మోదీ, భారత ప్రధాని
పరిస్థితి అదుపులోనే ఉంది: సీఎం
మహాకుంభ్ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. భక్తులు ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మి గాబరా పడొద్దు. తొక్కిసలాట జరిగిందని తెలిసిన వెంటనే పరిస్థితిని గురించి తెలుసుకునేందుకు పీఎం నాలుగుసార్లు ఫోన్ చేశారు.
యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం
25 మందిని గుర్తించాం..
మహాకుంభమేళా తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 25 మంది భక్తులను గుర్తించాం. మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం యూపీకి చెందిన వారు మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాల వారు కూడా మరణించారు. 36 మంది క్షతగాత్రులు స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. భక్తుల సహాయార్థం 1920 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశాం.
వైభవ్ కృష్ణ, మహాకుంభ్ డీఐజీ