30-01-2025 12:00:00 AM
కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు మృతిచెండంతో పాటుగా 60 మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా కుంభమేళాతో పాటుగా పర్వదినాలు, ఆధ్యాత్మిక సమ్మేళనాల సందర్భంగా ఇలాంటి తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి.
వందలమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే వేడుకల ఏర్పాట్లలో పాలకులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి. భక్తులు సైతం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఇవి నొక్కి చెప్తున్నాయి. వదంతులు, భక్తుల్లో భయాలు, తామే ముందుండాలనే తొందరపాటు కారణంగా జరిగే తోపులాటలే ఎక్కువగా ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి.
గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా కళ్లముందు మొదలుతూ ఉంది. బాబా పాదధూళి కోసం భక్తులు ఎగబడ్డంతో జరిగిన ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికులు మహిళలే.
మొన్నటికి మొన్న తిరుమల వెంకన్న సన్నిధిలో ముక్కోటి దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 40 మంది గాయపడ్డారు. ఇలాంటి దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయే వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలే ఉంటుండడం గమనార్హం.
మహిళలు ఆందోళనకు గురికావడం లేదా కిందపడిపోవడం, తల్లుల చేతుల్లో లేదా వెంట ఉండే చిన్నారులు కూడా వారితో పాటే ఊపిరాడక చనిపోవడమే ప్రధాన కారణం. 2005లో మహారాష్ట్రలోని మంధర దేవి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వెళ్లడం, ఆలయమెట్లపైనుంచి జారి భక్తులు ఒకరిపై మరొకరు పడ్డంతో 340 మంది ప్రాణాలు కోల్పోయారు.
2008లో హిమాచల్‌ప్రదేశ్‌లో నైనాదేవి ఆలయంలో జరిగిన తోపులాటలో 162 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. కొండచరియలు విరిగిపడుతున్నాయన్న వదంతులే ఈ ప్రమాదానికి కారణం. 2008లో రాజస్థాన్‌లోని చాముండేశ్వరీ దేవి ఆలయంలో, 2013లో నవరాత్రుల సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రత్నగఢ్ మందిరంలో జరిగిన తొక్కిసలాటలోనూ వందల ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికీ ఇలాంటి వదంతులే కారణం.
ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఘటనాస్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉంటాయి. సాయం కోసం క్షతగాత్రులు చేసే ఆక్రందనలు, భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులు చెల్లాచెదరుగా పడిపోవడమే కాకుండా ఒక్కోసారి డబ్బు, విలువైన వస్తువులు కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కాగా మౌని అమావాస్య నాడు పవిత్ర స్నానాలకు పదికోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు ముందునుంచీ చెబుతున్నా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు మాత్రం చేయకపోవడమే తొక్కిసలాటకు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ తొక్కిసలాట జరిగింది.
వెలుతురు సరిగా లేకపోవడం, తోపులాటలో ఒకరిపై ఒకరు పడిపోవడం వారిపైనుంచి జనం నడుచుకు పోవడంతో ఎక్కువ మంది చనిపో వడమో, గాయపడ్డమో జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని తొక్కిసలాట ఘటనలకూ దాదాపుగా ఇలాంటివే కారణాలు కావడం గమనార్హం.
గతంలో పోలిస్తే ఇప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలకు భక్తుల రాక పెరిగింది. ప్రత్యేక రవాణా సదుపాయాలు, నిర్వాహకులు, ప్రసార మాధ్యమాలు చేసే ప్రచారం ఇందుకు ప్రధా న కారణం. వేదభూమి అయిన భారత దేశంలో అధ్యాత్మిక చైతన్యం మంచిదే కానీ ప్రాణంకన్నా ఏదీ ఎక్కువ కాదనే విషయాన్ని భక్తులు సైతం గుర్తుంచుకోవాలి.
వీఐపీలకన్నా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తే ఎంత రద్దీనైనా అదుపు చేయవచ్చనే విషయాన్ని గ్రహిస్తే భవిష్యత్తులోనైనా ఇలాంటి సామూహిక మరణాలు చోటు చేసుకోకుండా ఉంటాయి.