ఇబ్బంది పడుతున్న పాదచారులు, వాహనదారులు
కోరుట్ల, జనవరి 22 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారి వెంబడి ఏర్పాటు చేసిన ఆధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం లేదు. దీంతో ఈ రోడ్డు మీదుగా అనునిత్యం ప్రయాణించే సదరు వాహనాదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్లు పని చేయకపోవడంతో ఆ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులు తమ ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతున్నారు.
దీంతో పలు ప్రమాదాలు, ట్రాఫిక్ స్తంభన వంటి సమస్యలు అనునిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గ కేంద్రం, రెవెన్యూ డివిజన్ కేంద్రం, రెండవ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన కోరుట్ల పట్టణంలో దాదాపు లక్ష పైచిలుకు జనాభా ఉంటుంది. నిత్యం రద్దీ కారణంగా ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూనే ఉన్నది.
ముఖ్యంగా ఉదయం, సాయంత్రం, పండుగల సమయాల్లో ట్రాఫిక్’కు తీవ్ర అంతరాయం ఏర్పడు తుంది. రోడ్డు దాటాలంటే వృద్ధులు, మహిళలు, పిల్లలు జంకుతున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న వాహనాల వినియోగంతో పాటూ వ్యాపార, వాణిజ్యాల వినిమయం కారణంగా ట్రాఫిక్ సమస్య సైతం క్రమంగా మరింతగా పెరుగుతూనే ఉన్నది.
వృథాగా ప్రభుత్వ నిధులు
ట్రాఫిక్ నియంత్రణ కోసం కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి వెంబడి కల్లూర్ రోడ్ చౌరస్తా, నంది చౌరస్తా కూడళ్లలో 2022 ఫిబ్రవరి నెలలో దాదాపు రూ.25 లక్షల టీయూఎఫ్‌ఐడిసి నిధులతో ఆధునిక ట్రాఫిక్ సిగ్నల్లను ఏర్పాటు చేశారు. అప్పటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య కొంత తగ్గు ముఖం పట్టగా, అది కాస్త మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది.
లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దాదాపు 3 నెలలుగా పని చేయడం లేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోవడంతో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాదారులు ఇష్టానుసారంగా వెళ్లడంతో రోడ్డు ప్రమా దాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనాలు అదుపు తప్పి వారికి వారుగా కింద పడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి.
పలువురు వాహదారులు వేగంగా వస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో పాదచారులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కల్లూర్ రోడ్డు చౌరస్తా, నంది చౌరస్తాలలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికైనా ’అలంకార ప్రాయంగా’ మారిన ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చోట ట్రాఫిక్ కానిస్టేబుళ్లను కూడా నియమిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.