calender_icon.png 23 January, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి

23-01-2025 12:25:44 AM

నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్

నారాయణపేట, జనవరి 22: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నారాయణ పేట ఆర్టీవో శాఖ  ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని మినీ స్టేడియంలో  ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ యోగేష్ గౌతమ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ మన అందరి బాధ్యత అన్నారు. సమిష్టి కృషితోనే ప్రమాదాలను నివారించ వచ్చని చెప్పారు. విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల గురించి స్కూలు కళాశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తెలిపారు. తల్లిదండ్రులు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తల్లిదండ్రులకు తెలపాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లాలో పోయిన సంవత్సరం 250 వరకు రోడ్డు ప్రమాదాలు జరిగాయని అందులో 102 మంది చనిపోవడం జరిగిందని, ఈసారి రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి అన్ని శాఖల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని తెలిపారు. విద్యార్థులు ముందుగా మూడు నిబంధనలు గుర్తించుకోవాలని తెలిపారు.

అందులో ఇంట్లో నుండి ఫ్యామిలీ వాళ్లు బయటికి వెళ్లే సమయంలో తప్ప కుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడపరాదని ఇంట్లో కి తాగి రావద్దని చెప్పాలని కోరారు. మైనర్ డ్రైవింగ్, చిన్నపిల్లలు 18 సంవత్సరాలు నిండకుండా వాహనాల నడపరాదని ఈ మూడు నిబంధనలు పాటిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు.

ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంలో పోలీసు శాఖ చేపట్టే కార్యక్రమాలకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. అదే విధంగా జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నియమ, నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని ఎస్పీకోరారు.  అదేవిధంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల(బ్లాక్ స్పాట్స్ )ను గుర్తించి అక్కడ సంబంధిత శాఖలతో సమన్వయంతో నివారణా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు.

వ్యాపారస్తులు,ఆటో డ్రైవర్లు,జీపు డ్రైవర్లు, పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీస్ వారి సూచనలను పాటించాలన్నారు. అన్ని శాఖల వారు సమిష్టిగా ట్రాఫిక్ నియంత్రణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఏర్పాటు చేసిన వాల్పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆర్టీవో కార్యాలయ అధికారులు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం రోడ్డు భద్రత మాసోత్సవాల పై ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా ఎస్పీ తో కలసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి  కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ మనోహర్ థియేటర్ నుంచి పాత బస్టాండ్, సత్య నారాయణ చౌరస్తా మీదుగా తిరిగి మినీ స్టేడియానికి చేరుకుంది. 

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి, ఆర్టీవో మేఘా గాంధీ, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్టీసీ డిఎం లావణ్య, డీఈవో గోవిందరాజులు, మున్సిపల్ కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొనంగేరి హనుమంతు, సిఐ శివశంకర్, ఎస్. ఐ. వెంకటేశ్వర్లు, ఆర్టీవో కార్యాలయ, పోలీసు అధికారులు, సిబ్బంది, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.